విశాఖపట్నం, న్యూస్‌లైన్: అక్కినేని వంశంలోని మూడు తరాల నటులతో తీస్తున్న మనం సినిమాలో తాను కూడా నటించడం ఓ వరంగా భావిస్తున్నానని ప్రముఖ హీరోయిన్ శ్రీయ అన్నారు. సినిమాల్లో నటించడంతోపాటు పేదలకు సేవ చేయడంలో మరింత తృప్తి కలుగుతుందని చెప్పారు. ఓ ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం విశాఖ వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
మంచి సినిమాల కోసం....
ఈ మధ్య సినిమాలు తక్కువగా ఒప్పుకుంటున్నాను. చాలా మంది కథలతో వస్తున్నారు. కానీ నేను ఆచితూచి అడుగు వేస్తున్నాను. మంచి కథ దొరికితేనే ఒప్పుకుంటున్నాను. అందుకే ఇటీవల లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, పవిత్ర మాత్రమే చేశాను.
ఆశించినంత విజయం దక్కలేదు
పవిత్ర సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. అది చాలా మంచి సినిమా. సందేశాత్మకమైన చిత్రం. కానీ ఆశించిన విజయం దక్కలేదు.
ఏఎన్‌ఆర్‌తో నటించడం అదృష్టం
‘మనం’ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతో నటించడం అదృష్టం. నా కెరీర్‌లో ఇది మరిచిపోలేని చిత్రంగా భావిస్తున్నా. నటిగానే కాకుండా ఓ ప్రేక్షకురాలిగా కూడా ఈ సినిమాను ఎప్పుడు తెరపై చూద్దామా అని తహతహలాడుతున్నాను.
యోగా టిప్స్ నేర్చుకుంటున్నా...
నాకు సంతోషం సినిమాలో అక్కినేని అమలతో మంచి పరిచయం ఏర్పడింది. ఆమె చాలా మంచి వ్యక్తి. తన వద్ద నేను విపాసన యోగ టిప్స్ నేర్చుకుంటున్నాను.
సేవా కార్యక్రమాలు
స్త్రీ స్పందన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నాను. దీని ద్వారా అంధులకు సేవ చేస్తున్నాను. వివిధ దేశాల్లో ప్రభుత్వం అంధులకు, వికలాంగులకు ఎంతో సేవ చేస్తోంది. మన దేశంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీరికోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి.
వీధి బాలలపై ఆర్ట్ ఫిల్మ్
ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు దీప మెహతా దర్శకత్వంలో నేను వీధి బాలల కోసం ఓ ఆర్ట్ ఫిల్మ్ చేస్తున్నాను. అందులో నా పాత్ర పేరు పార్వతి. ‘మిడ్‌నైట్ చిల్డ్రన్’ అనే పేరుతో ఈ ఆర్ట్ ఫిల్మ్ తీస్తున్నారు.
విశాఖ నాకు చాలా ఇష్టం
నాకు విశాఖ అంటే చాలా ఇష్టం. షూటింగ్‌లకు, క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చాను. ఎప్పుడు వచ్చినా విశాఖ కొత్తగానే ఉంటుంది. సహజసిద్ధమైన అందంతో కొత్తగానే దర్శనమిస్తుంది. ఇక్కడ బీచ్ నాకు చాలా ఇష్టం.
‘మనం’లో నటించడం నాకో వరం
Published Sun, Dec 29 2013 2:06 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement