సమైక్య శంఖారావానికి గ్రీన్‌సిగ్నల్
* వైఎస్సార్‌సీపీ సభకు షరతులతో హైకోర్టు అనుమతి
* మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకే నిర్వహించుకోవాలి
* నొప్పించేలా, రెచ్చగొట్టేలా సభలో ప్రసంగాలు చేయరాదు
* ఇతరులు వ్యతిరేకిస్తున్నారని అనుమతి నిరాకరణ సరికాదన్న న్యాయమూర్తి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల హైదరాబాద్ ఎల్.బి.స్టేడియంలో నిర్వహించతలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. సభకు అనుమతిని నిరాకరిస్తూ సెంట్రల్‌జోన్ డీసీపీ జారీ చేసిన ఆదేశాలను కొట్టివేసింది. అయితే ఇందుకు సంబంధించి కొన్ని షరతులు విధించింది. సభను మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించుకోవాలని సూచించింది. ఇతరులను నొప్పించేలా, రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయరాదని స్పష్టం చేసింది. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం గానీ, ధ్వంసం చేయడం గానీ చేయరాదని తేల్చి చెప్పింది. ఆ విధంగా నిర్వాహకుల నుంచి హామీ తీసుకోవాలని పోలీసులకు సూచిం చింది. ఈ మేరకు జస్టిస్ నూతి రామ్మోహనరావు తీర్పు వెలువరించారు.
సభకు అనుమతిని నిరాకరిస్తూ డీసీపీ కమలాసన్‌రెడ్డి ఈ నెల 12న నిర్ణయం వెలువరించారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ హైకోర్టులో గతవారం అత్యవసరంగా హౌస్ మోషన్ రూపం లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత మూడురోజులుగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బుధవారం తీర్పునిచ్చారు. సమైక్య శంఖారావం సభను తెలంగాణ విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయన్న కారణంతో సభ నిర్వహణకు అనుమతిని నిరాకరించడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఇది ఎంత మాత్రం సహేతుకమైన కారణం కాదని ఆయన స్పష్టం చేశారు.
అలా అయితే ఏ బహిరంగ సభ సాధ్యం కాదు...
‘పిటిషనర్ ఏ ఉద్దేశంతో అయితే సభ నిర్వహిస్తున్నారో, దానిని ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న వివిధ రాజకీయ పార్టీల నేతలు కచ్చితంగా ఖండిస్తారు. రాజకీయ పార్టీలు, సాధారణ ప్రజానీకంలో భిన్నమైన అభిప్రాయాలు ఉండటం అసాధారణమేమీ కాదు. అయితే ఈ కారణంగా తమ భావాలను వ్యక్తం చేసేందుకు అనుమతించకపోవడం సరికాదు. బహిరంగ సభను ఏకాభిప్రాయం ద్వారానే నిర్వహించాలంటే ఏ బహిరంగ సభ నిర్వహణ సాధ్యం కాదు.
ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టాలంటే, ప్రజా ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశాల్లో భావ ప్రకటనకు, అభిప్రాయాలను వెల్లడించడానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఉండాలి. శాంతియుతంగా సమావేశం నిర్వహించుకునే హక్కుకు ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ హక్కును నియంత్రించాలని, అడ్డుకోవాలని, అందులో జోక్యం చేసుకోవాలని భావించే వ్యక్తులపైనే.. తమ చర్యలను న్యాయబద్ధ్దంగా సమర్థించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత...
‘శాంతియుతంగా సమావేశం నిర్వహించుకునే హక్కును ఎవ్వరూ కాలరాయలేరు. తమ హక్కులను ఉపయోగించుకునే వారికి వారి ప్రత్యర్థి గ్రూపుల నుంచి తగిన రక్షణ కల్పించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, దాని యంత్రాంగంపై ఉంది. సమాజంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని భావిస్తే ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవచ్చు. ఇబ్బందులు పెట్టే వారిని దృష్టిలో పెట్టుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడం ఎంతో ముఖ్యం.
సమావేశానికి ముందు, తరువాత, సమావేశం జరిగే సమయంలో గొడవలు, హింసాత్మక ఘటనలు జరుగుతాయనే కారణంతో పోలీసులు సభను అడ్డుకోవడానికి వీల్లేదు. అసాంఘిక శక్తులు పైచేయి సాధించకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు యంత్రాంగానిదే. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్న రాజకీయ పార్టీలు, వివిధ వర్గాలు పిటిషనర్ అభిప్రాయాలతో విభేదిస్తున్నందున శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే అభిప్రాయానికి పోలీసులు రావడం సరికాదు. ఈ కారణంతో సభకు అనుమతిని నిరాకరించడం అహేతుకం..’ అని జస్టిస్ రామ్మోహనరావు తేల్చి చెప్పారు.