గన్నవరం : ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రధాన అనుచరుడైన ఓలుపల్లి మోహన్‌రంగా ఇంట్లో చోరీ జరిగిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు లోపలికి చొరబడి సుమారు రూ.3.75 లక్షల విలువైన సొత్తును అపహరించుకుపోయారు. పోలీసుల సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఇస్లాంపేట సమీపంలో నివసిస్తున్న మోహన్‌రంగా వైద్య విద్యను అభ్యసిస్తున్న కుమారైల చదువుల నిమిత్తం రెండేళ్లుగా కుటుంబంతో సహా ఏలూరులో ఉంటున్నారు.
అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన ఆయన.. తన మేనల్లుడిని వాటర్ బాటిల్ కోసం మొదటి అంతస్తులోని తన నివాసానికి పంపించాడు. అయితే, ఇంట్లోని ఉత్తరం వైపు తలుపులు తెరచి ఉండి, బెడ్‌రూమ్‌లోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడంతో విషయాన్ని రంగాకు చెప్పారు. ఆయన వచ్చి చూడగా బీరువాలోని విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు, ఇతర సామాగ్రి కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్దారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో ఈస్ట్ జోన్ ఏసీపీ వి. విజయభాస్కర్, సీఐ కె. శ్రీధర్‌కుమార్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి ఆధారాలను సేకరించే ప్రయత్నం చేశారు. శుక్రవారం రాత్రి చోరీ జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరం వైపున ఉన్న తలుపును బలంగా నెట్టి ఇంట్లోని ప్రవేశించి స్క్రూ డ్రైవర్, కిచెన్‌లోని చాకుతో బీరువా లాకును వంచి వస్తువులను అపహరించుకుపోయారు. సుమారు 152 గ్రాముల బంగారు వస్తువులు, 200 గ్రాముల వెండి వస్తువులు, ఖరిదైన వాచీలు, తదితర సామాగ్రి చోరీకి గురైనట్లు పోలీసులు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment