తలసరి ఆదాయమే ప్రజల స్థితిగతులకు, ఆయా ప్రాంతాల అభివృద్ధి తీరుకూ నిదర్శనం. ఈ విషయంలో రాజధాని హైదరాబాద్ దేశానికే తలమానికంగా నిలుస్తోంది.
సాక్షి, హైదరాబాద్: తలసరి ఆదాయమే ప్రజల స్థితిగతులకు, ఆయా ప్రాంతాల అభివృద్ధి తీరుకూ నిదర్శనం. ఈ విషయంలో రాజధాని హైదరాబాద్ దేశానికే తలమానికంగా నిలుస్తోంది. తలసరి ఆదాయాన్ని ప్రస్తుత ధరల ఆధారంగా కాకుండా కనీసం 5, 6 ఏళ్ల క్రితం నిర్ధారిత సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుంటే గణాంకాల్లో మరింత స్పష్టత ఉంటుందని, అభివృద్ధిని కచ్చితంగా లెక్కగట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలా 1999-2000 ఆధారంగా తీసుకొని 2007-08కి లెక్కగట్టిన గణాంకాల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.26,310. హైదరాబాద్‌లో దీనికంటే 50 % అధికంగా, అంటే రూ.39,145 నమోదైంది. ప్రాంతాలవారీగా చూస్తే రూ.26,665 తలసరి ఆదాయంతో కోస్తా తొలి స్థానం లో ఉంది. తెలంగాణ తలసరి హైదరాబాద్‌తో కలిపితే రూ.27,000, విడిగా లెక్కిస్తే రూ.25,237 ఉంది. ఇక సీమలో అతి తక్కువగా రూ.23,860 తలసరి ఆదాయం నమోదైంది. 1993-94లో హైదరాబాద్ తలసరి ఆదాయం రాష్ట్ర సరాసరితో దాదాపు సమానంగానే ఉండేది. ప్రాంతాలవారీగా అప్పట్లో తెలంగాణదే ఆఖరు స్థానం. కోస్తా, సీమ తొలి, రెండో స్థానాల్లోనిలిచాయి.
తలసరి ఆదాయ వృద్ధిలో ఆఖరున కోస్తా..
2000-01 నుంచి 2007-08 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఎనిమిదేళ్లలో రాష్ట్ర సరాసరి తలసరి ఆదాయం 58 శాతం, హైదరాబాద్‌లో తలసరి ఆదాయం 77 శాతం పెరిగాయి. హైదరాబాద్ ఆదాయాన్ని కలపకుండా తెలంగాణలో తలసరి ఆదాయం 60 శాతం పెరిగితే సీమలో 58 శాతం పెరిగింది. 54 శాతం వృద్ధితో కోస్తా ఆఖరు స్థానంలో నిలిచింది.
ఇదీ ప్రామాణిక విధానం..
దేశంలో అభివృద్ధికి కొలమానంగా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)నే సూచికగా తీసుకుంటారు. జీడీపీకి మూలం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ). జీఎస్‌డీపీని లెక్కగట్టడానికి జిల్లా స్థూల ఉత్పత్తి (డీడీపీ)ని ఆధారంగా తీసుకుంటారు. డీడీపీ ఆధారంగా జిల్లాలు, ప్రాంతాల ఆర్థికస్థితిని, అభివృద్ధిని అంచనా వేయవచ్చు. డీడీపీ ఆధారంగా తలసరి ఆదాయాన్ని లెక్కించవచ్చు. తలసరి ఆదాయాన్ని బట్టి ఆయా ప్రాంతాల అభివృద్ధి తీరును తెలుసుకోవచ్చు. కాలపరీక్షకు నిలిచిన ఈ విధానాన్నే ఆర్థికాభివృద్ధిని లెక్కగట్టడానికి ప్రామాణికంగా తీసుకుంటున్నారు.