
భర్త ఆదరిస్తేనే దీక్ష విరమిస్తా: వీణ
తిరుపతి: భర్త హరికృష్ణ తనతో కలిసి కాపురం చేస్తానంటేనే దీక్ష విరమిస్తానని వీణ స్పష్టం చేసింది.గత రెండు రోజుల క్రితం తనను, బిడ్డను భర్త ఆదరించాలంటూ దీక్ష చేపట్టిన వీణ శుక్రవారం కూడా తన నిరసనను కొనసాగించింది. ఈ రోజు ఉదయం బాధితురాలిని పరామర్శించిన ఎమ్మెల్యే వెంకటరమణ .. సాయంత్రానికల్లా సమస్యను పరిష్కారిస్తానని హామీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే వీణ మామయ్య గోవిందయ్య చర్చలు చేపట్టారు. వీణ దీక్ష చేస్తున్న వార్తలను చూసిన భర్త హరికృష్ణ కూడా ఘటనా స్థలికి చేరుకున్నాడు. అయితే భర్త హరికృష్ణ తనతో కాపురం చేస్తేనే దీక్ష విరమిస్తానని వీణ తెలిపింది. ఒకవేళ అలా కాకపోతే దీక్షను కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసింది.
తిరుపతి భవానీనగర్‌కు చెందిన గోవిందయ్య, పద్మావతి కుమారుడు హరికృష్ణతో జీవకోనకు చెందిన వెంకటముని, జ్యోతి కుమార్తె వీణకు 2013 జనవరిలో వివాహమైంది. 11 నెలల క్రితం వీరికి ఆడబిడ్డ పుట్టింది. అప్పటి నుంచి అత్తగారింటి నుంచి చూడడానికి ఎవ్వరూ రాలేదు. కనీసం తండ్రి హరికృష్ణ కూడా రాలేదు. ఈ సమస్య తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సూచన మేరకు బుధవారం ఏఎస్పీని కలిశారు. దీంతో వీణ భర్త హరికృష్ణను పిలిపించి, కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తరువాత ఇంటికి బయలుదేరినా మార్గమధ్యంలోనే అదృశ్యమయ్యాడని వీణ వివరించింది. తనను ఆదరించమని అత్తారింటి ముందు దీక్షకు దిగినట్లు ఆమె స్పష్టం చేసింది.
‘మా అత్తామామలకు, భర్తకు ఆస్తులు చూసుకోవడానికి వారసుడు కావాలని తనను భర్త నుంచి దూరం చేసేందుకు యత్నిస్తున్నారని వీణ ఏకరువు పెట్టింది. అవసరమైతే రెండో పెళ్లి చేయడానికైనా సిద్ధపడేలా ఉన్నారు. తనను, తన బిడ్డను భర్త దగ్గరకు చేర్చుకుంటాడనే ఆశ ఉంది అంటున్న వీణకు మహిళ సంఘాల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది.