నాన్నకే నా మద్దతు: రామ్చరణ్
హైదరాబాద్ : 'రాజకీయాల గురించి నాకు అవగాహన లేదు. కానీ, మా నాన్నకి నేను పూర్తిగా మద్దతు ఇస్తా' అని చిరంజీవి కుమారుడు, సినీనటుడు రామ్చరణ్ అన్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో జరిగిన ప్రయివేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన బాబాయ్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగప్రవేశం గురించి స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలు చేశారు. పవన్ కొత్త పార్టీ పెడతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పత్రికా విలేకరలు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ..''బాబాయ్ అంటే నాకు గౌరవం, ఆయనకు మా కుటుంబ మద్దతు ఉంటుంది. రాజకీయాల్లో మాత్రం నా మద్దతు నాన్నకే. నా వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కనపెడితే, మా కుటుంబంలో ఓ వ్యక్తి ఏదైనా చేస్తే, దాన్ని ఆపే హక్కు ఎవరికీ లేదు'' అని రామ్చరణ్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ఆయన వ్యక్తిగతం అన్నారు.
ఇటీవల కాలంలో మెగాస్టార్ కుటుంబంలో విబేధాలు ఉన్నాయనే వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ చిత్రం ప్రారంభ కార్యక్రమంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాట్లాడకోకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా, మార్చి 14 తేదిన పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ ప్రవేశంపై ఓ ప్రకటన చేయనున్నారు.