రాష్ట్రంపై ఐఏఎస్ అధికారులు కినుక వహిస్తున్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా భారీ సంఖ్యలో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారు. గత మూడేళ్లలోనే రాష్ట్ర కేడర్‌కు చెందిన 30 మందికి పైగా ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు.
మూడేళ్లలో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయిన 30 మంది ఐఏఎస్‌లు
రాజకీయ అనిశ్చితి, అభద్రతా భావమే కారణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై ఐఏఎస్ అధికారులు కినుక వహిస్తున్నారు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా భారీ సంఖ్యలో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారు. గత మూడేళ్లలోనే రాష్ట్ర కేడర్‌కు చెందిన 30 మందికి పైగా ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, రాజకీయ క్రీడలో ఐఏఎస్‌లను పావులుగా వాడుకోవడమే దీనికి కారణమని మెజారిటీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు బనాయించడంలో భాగంగా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు ఐఏఎస్‌లను బాధ్యులను చేయడాన్ని వారు తీవ్రంగా తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉంటే అనవసరమైన వివాదాల్లో ఇరుక్కోవాల్సి వస్తుందనే భావనతోనే వారు రాష్ట్రం నుంచి తరలిపోతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు వివిధ హోదాల్లో పనిచేసిన అనుభవంగల ముఖ్య కార్యదర్శి, కార్యదర్శి స్థాయి అధికారులు కూడా రాష్ట్రాన్ని వీడి వెళ్లిపోవడం గమనార్హం.
గత మూడేళ్లలో శేషాద్రి, సందీప్‌కుమార్ సుల్తానియా, అశోక్‌కుమార్, అరవింద్‌కుమార్, సుమిత్రా దావ్రా, కాటమనేని భాస్కర్, చిత్రారామచంద్రన్, పుష్పా సుబ్రమణ్యం, రెడ్డి సుబ్రమణ్యం, ప్రవీణ్ ప్రకాశ్, కె.దమయంతి, శశాంక్ గోయల్, రజిత్ భార్గవ, వసుధా మిశ్రా, రాజీవ్ రంజన్ మిశ్రా, సతీష్ చంద్ర, అజయ్ త్రిపాఠి, నర్సింగరావు, దినేశ్ కుమార్, సి.బి.వెంకటరమణ, సత్యనారాయణ మహంతి, ఆర్.భట్టాచార్య, ఆర్.పి.వట్టల్, ఇంద్రజిత్ పాల్, జె.సత్యనారాయణ తదితరులు రాష్ట్రం వీడి కేంద్ర సర్వీసులకో, శిక్షణ పేరుతోనో వెళ్లిపోయారు. ఫలితంగా రాష్ట్రంలో విద్య, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, సంక్షేమం, రెవెన్యూ వంటి కీలక శాఖలకు అనుభవం గల ఐఏఎస్‌లు లేక డీలా పడ్డాయి. చివరికి ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న వినయ్‌కుమార్ కూడా కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ కానున్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి రాష్ట్రం వీడి కేంద్ర సర్వీసుకు వెళ్లిపోవడం ఆశ్చర్యమేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అంతేకాదు.. రాష్ట్రం నుంచి అనేక విషయాల్లో లబ్ధిపొందిన సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా రాష్ట్రానికి సేవలు అవƒ సరమైన సమయంలో కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారు. మంచి పోస్టింగ్ దొరకనివారు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతుంటారని.. కానీ, రాష్ట్రంలో మంచి పోస్టింగ్‌లో ఉన్న ఐఏఎస్‌లు కూడా వెళ్లిపోవడం ఆశ్చర్యకరమని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రాష్ర్టంలో 300 మంది ఐఏఎస్ అధికారులున్నారు. వారందరూ కూడా ఆరు స్థాయిల్లో సీనియారిటీ ప్రకారం వివిధ శాఖలకు సేవలందిస్తారు. కానీ, ఇటీవల ఐఏఎస్‌ల్లో కూడా ఉత్తరాది, దక్షిణాది, స్థానిక అనే గ్రూపిజం పెరిగిపోతోందనే ఆరోపణలున్నాయి. పోస్టింగ్‌లు ఇచ్చే వారిని ప్రభావితం చేయగల స్థానంలో ఏ ప్రాంతం వారు ఉంటే... ఆ ప్రాంతం వారికి కీలక పోస్టింగ్‌లు ఇస్తున్నారనే వాదన ఇటీవల ఐఏఎస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.