ట్రిపుల్‌ ఐటీల రెండో విడత కౌన్సెలింగ్‌లో ప్రతిష్టంభన! | Iiit counseling stopped with high court orders | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీల రెండో విడత కౌన్సెలింగ్‌లో ప్రతిష్టంభన!

Published Wed, Aug 1 2018 3:10 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM

Iiit counseling stopped with high court orders - Sakshi

నూజివీడు: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలో రాష్ట్రంలో శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీల్లో రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహణలో ప్రతిష్టంభన నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు సామాజిక విద్యా వెనుకబాటుతనం కింద అదనంగా కల్పించిన 0.4 డిప్రెవేషన్‌ స్కోర్‌ విషయమై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

అంతేకాకుండా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఏ విధమైన చర్యలు చేపట్టవద్దని ఆదేశించడంతో రెండో విడత కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది. గత నెల 4 నుంచి 7 వరకు మొదటి విడత కౌన్సెలింగ్‌ నిర్వహించగా నాలుగు ట్రిపుల్‌ఐటీలకు కలిపి 3,743 సీట్లకు   3,258 సీట్లు భర్తీ అయ్యాయి. 485 సీట్లు మిగిలాయి. ట్రిపుల ఐటీలవారీగా నూజివీడులో 90, ఇడుపులపాయలో 123, శ్రీకాకుళంలో 135, ఒంగోలులో 137 సీట్లు మిగిలాయి.

అలాగే ప్రత్యేక కేటగిరీ కింద ఉన్న 257 సీట్లు కలిపి మొత్తం 742 సీట్లను భర్తీ చేయాల్సి ఉంది. అయితే వైఎస్సార్‌ జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని తనకు మెరిట్‌ ఉన్నా ట్రిపుల్‌ ఐటీలో సీటు ఇవ్వలేదని హైకోర్టును ఆశ్రయించడంతో దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డిప్రెవేషన్‌ స్కోర్‌ 0.4ను ఈ ఏడాది కూడా కలపడంపై రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించవద్దని ఆదేశించడంతో గత నెల 20 నుంచి 23 వరకు నిర్వహించాల్సిన రెండో విడత కౌన్సెలింగ్‌ నిలిచిపోయింది.

0.4 డిప్రెవేషన్‌ స్కోర్‌ వద్దంటూ గతంలోనే తీర్పు
గతేడాది ఇదే అంశంపై డిప్రెవేషన్‌ స్కోర్‌ కలపడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సామాజిక, ఆర్థిక వెనుకబాటు సూచీ కిందే రిజర్వేషన్లు అమలవుతున్నందున మళ్లీ అదే పేరుతో ప్రత్యేకంగా 0.4 డిప్రెవేషన్‌ స్కోర్‌ అవసరం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆర్జీయూకేటీ అధికారులు ఉన్నత విద్యామండలి ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి వారి సూచనల మేరకు 0.4 డిప్రెవేషన్‌ స్కోర్‌ కలిపారు. ఈ ఏడాది ఇదే పద్ధతిలో ప్రవేశాలు నిర్వహించడంతో హైకోర్టు రెండో విడత కౌన్సెలింగ్‌ నిలిపేసింది.

రెండో విడత కౌన్సెలింగ్‌ లేనట్టేనా!
ప్రవేశాల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉన్నందున రెండో విడత కౌన్సెలింగ్‌ ఉంటుందా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు స్పోర్ట్స్, ఎన్‌సీసీ, పీహెచ్‌సీ, సైనికోద్యోగుల కోటా కింద సీట్లు ఎప్పుడు భర్తీ చేస్తారా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఏదైనా కాలేజీలో చేరిన తర్వాత కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే తాము చెల్లించిన వేలాది రూపాయలు తిరిగి రావనే ఆందోళనతో ఉన్నారు.అయితే రెండో విడత కౌన్సెలింగ్‌ తిరిగి ఎప్పుడు ఉంటుందో కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంటుందని ట్రిపుల్‌ఐటీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

కోర్టు నుంచి స్పష్టత వచ్చాకే..
రెండో విడత కౌన్సెలింగ్‌ అంశం కోర్టు పరిధిలో ఉంది. దీనిపై ఇంకా కోర్టు నుంచి స్పష్టత రాలేదు. ఒకటి, రెండు వారాల్లో స్పష్టత వస్తుందనుకుంటున్నాం. అది రాగానే రెండో విడత కౌన్సెలింగ్‌ తేదీలను ప్రకటిస్తాం. – ఆచార్య వేగేశ్న రామచంద్రరాజు, ఆర్జీయూకేటీ వైస్‌చాన్సలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement