బీ కేటగిరీ సీట్లకూ రెండో కౌన్సెలింగ్
తేల్చి చెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణల్లోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా (బీ కేటగిరీ) సీట్లు మిగి లిపోతే వాటి భర్తీకి రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎన్‌ఆర్‌ఐ కోటా (సీ కేట గిరీ) సీట్ల సంఖ్య సుప్రీంకోర్టు నిర్దేశించిన పరిమితి దాటరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉభయ రాష్ట్రాల్లోని ప్రైవేటు వైద్య కళాశాలలు బీ కేటగిరీలో మిగిలిపోయిన సీట్లను ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లుగా మార్పిడి చేసుకుంటున్న వైనంపై హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
కన్వీనర్ కోటా సీట్లను రెండో కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నప్పుడు, యాజమాన్య కోటా సీట్లకు సైతం రెండో కౌన్సెలింగ్‌ను వర్తింపజేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్లు కోర్టుకు నివేదించారు. నీట్ మెరిట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేయాల్సిన బీ కేటగిరీ సీట్లను యాజమాన్యాలు సీ కేటగిరీ సీట్లుగా మార్పిడి చేసుకుంటున్నాయని, ఇందుకు ప్రభుత్వాలు సైతం అనుమతినిస్తున్నాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బీ కేటగిరీ సీట్లను సీ కేటగిరీ సీట్లుగా మార్చుకోవడానికి వీల్లేదని, బీ కేటగిరీ సీట్లకు సైతం రెండో కౌన్సెలింగ్ నిర్వహించాలని స్పష్టం చేసింది.