భూమాతకు శోకం! | Illegal soil dredging In Karedu Ponds | Sakshi
Sakshi News home page

భూమాతకు శోకం!

Published Mon, Apr 2 2018 9:03 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM

Illegal soil dredging In Karedu Ponds - Sakshi

మట్టి తరలింపుతో పడిన గుంతలు

ఉలవపాడు: కరేడు చెరువు అక్రమార్కుల దెబ్బకు విలవిల్లాడుతోంది. చెరువులో ఉన్న మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా కొంతమంది అధికారపార్టీ పెద్దలు జేసీబీలతో ట్రాక్టర్లకు ఎత్తి «ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులకు తెలిసినా ఆవైపు కన్నెత్తి చూడటంలేదు. అధికారం అండ ఉండటంతో నిస్సిగ్గుగా వ్యవవహరిస్తున్నారు. గతంలో కూడా ఓ సారి భారీగా మట్టిని తరలించారు. ఆ సమయంలో అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా రాలేదు. పని అంతా పూర్తి అయిన తరువాత వారానికి వచ్చిన జేఈ రాజశేఖరరెడ్డి.. అక్రమంగా మట్టి తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై కరేడు చెరువు నీటి సంఘం అధ్యక్షురాలు సింధుప్రియ పోలీసుల ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మట్టి తరలిపోతుండటం వల్ల  తమకు ఇబ్బంది కలుగుతోందని రైతులు వాపోతున్నారు.

భారీగా తరలింపు...
శనివారం రాత్రి, ఆదివారం జేసీబీలతో సుమారు 650 ట్రిప్పులు మట్టిని తరలించినట్లు సమాచారం. కరేడు గ్రామానికి చెందిన అధికారపార్టీ నాయకులు ఆధ్వర్యంలో ఈ తరలింపు జరుగుతోంది. ఒక్కో ట్రాక్టరు 380 రూపాయల చొప్పున సమీపంలో నిర్మిస్తున్న హేచరీలకు తోలుతున్నారు. అంటే  రెండు రోజుల్లో 2 లక్షల 47 వేల రూపాయల మట్టిని దోచేశారు. దీనికి తోడు చెరువులో క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కడ పడితే అక్కడ గుంతలు పెడుతున్నారు.

అనుమతి తీసుకుని క్రమ పధ్ధతిలో మట్టి తీసుకుంటే నీటి నిల్వ పెరుగుతుంది. కానీ అక్రమార్కులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దీనివలన చెరువులో నీరు సక్రమంగా ఆయుకట్టు పొలాలకు చేరదు. గుంతల్లోనీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతుంది.

ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
సాధారణంగా చెరువు మొత్తం నీటిసంఘం అధ్యక్షురాలు సభ్యులపై అధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. తమ చెరువు నుండి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని నీటి సంఘం అ«ధ్యక్షురాలు సింధుప్రియ ఎస్సైకి ఫోన్‌ చేసి తెలియచేశారు. అక్రమ తరలింపును అడ్డుకోవాలని కోరారు. దీంతో ఎస్సై నీటిపారుదల శాఖ అధికారుల చేత చెప్పించాలని.. మీరు చెపితే రానని చెప్పినట్లు తెలిపారు. తాను అధ్యక్షురాలిగా ఫిర్యాదు చేసినా అక్రమ తరలింపును ఆపడానికి నీటిపారుదల శాఖ అధికారులు కానీ, పోలీసులు కానీ రాలేదని వాపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement