♦ 27 హామీలకు మూడే అమలు
♦ 19 కోర్టు పెండింగ్‌లో ఉన్నాయి
♦ చిత్తశుద్ధితో కృషి చేయండి
♦ శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మన్
చిత్తూరు (సెంట్రల్) : ప్రజావసరాల నిమిత్తం శాసనసభలో ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ హామీల అమలు కమిటీ చైర్మన్ పి.వెంకటేష్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లాకు సంబంధించి శాసనసభలో ఇచ్చిన హామీల అమలుపై వివిధ శాఖల అధికారులతో కమిటీ సమీక్షించింది. ఈ సమీక్షలో చైర్మన్‌తో పాటు సభ్యులు పి.రమేష్‌బాబు, జోగేశ్వరరావు, పి.గోవిందసత్యనారాయణ, చింతలరామచంద్రారెడ్డి పాల్గొనగా, కమిటీ సహాయక కార్యదర్శి రాజ్‌కుమార్, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, తుడా వీసీ వినయ్‌చంద్, డీఆర్వో విజయచందర్ హాజరయ్యారు.
సమావేశనంతరం చైర్మన్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి 26 హామీల అంశాలు రాగా, మూడు మాత్రమే పూర్తి చేశారన్నారు. మరో నాలుగు అంశాలను టీటీడీలో సమీక్షించనున్నామని, మిగిలిన 19 అంశాలు ఎక్కువగా భాగం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సమీక్షలో వచ్చిన వాటిలో ప్రధానంగా సాగు, తాగునీరు, రోడ్ల నిర్మాణాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల సదుపాయాల పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో నీటి సౌకర్యాలు, వాగులు, వంకల మరమ్మతులు వంటి వాటిని సమగ్రంగా సమీక్షించినట్లు చెప్పారు.
ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రతివారం ముఖ్య కార్యదర్శులతో చర్చించి, అవసరమైన వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను వీలైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న హామీలను అవసరం మేరకు పూర్తి చేసేందుకు కృషి చేస్తామని, ఇప్పటికే కార్యచరణను అధికారులు రూపొందించారని కమిటీకి వివరించారు. కోర్టుకు సంబంధంలేని అంశాలు సంబంధిత శాఖల కార్యదర్శులు తీసుకెళ్ళి పరిష్కరిస్తామని కమిటీకి తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
హామీలను అమలు చేయండి
Published Thu, Apr 16 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM
Advertisement