విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: వరుస ఎన్నికల షెడ్యూళ్లు విడుదలైన నేపథ్యంలో జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు కలెక్టర్ కాంతి లాల్‌దండే ప్రకటించారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలు అధికారులుగా ఎంపీడీఓలు వ్యవహరిస్తారని స్పష్టం చేశా రు. కోడ్ ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని, ఉల్లంఘించిన వారికి నోటీసులు జారీ చేయాలని సూచించారు.
మత సామరస్యానికి విఘాతం కలిగించే విధంగా రాజకీయ పక్షాలు ప్రార్థనా మందిరాలు, చర్చిలు, దేవాలయాలు, మసీదులు, ర్యాలీలలో లౌడ్ స్పీకర్లు, సదస్సులు, సమావేశాలు నిర్వహించకూడదని సూచించారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని వీడియో కాన్ఫెరెన్స్ హాలులో జిల్లా యంత్రాంగంతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలుకు జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారానికి సభలు, సమావేశాలు నిర్వహించే ముందు తహశీల్దార్ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతిలేని మద్యం దుకాణాలను, బెల్టుషాపులను మూసి వేయించాలని ఆదేశించారు.
ఈ నెల 5 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు, ఫొటోలు, పోస్టర్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. మార్చి 5వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి ఓటర్ల జాబితాను పోలింగ్ స్టేషన్ వారీగా వెలువరించాలని సూచించారు. అంతేకాకుండా పోలింగ్ స్టేషన్‌ల వద్ద తాగునీరు, విద్యుత్, వీడియోగ్రఫీకి అవసరమయ్యే ప్లగ్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఓటర్లు క్యూలో వెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఎన్నికల సిబ్బంది, బందోబస్తు నియామకానికి, ఎన్ని కల సామగ్రి తరలించేందుకు అవసరమైన వాహనాల ప్రణాళికలను తయారు చేయాలన్నారు. వెబ్‌కాస్టింగ్‌కోసం ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల జాబితాను సిద్ధం చేయాలని కోరారు. అదేవిధంగా ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ కేంద్రాలను గుర్తించాలని వీటికి ఇన్‌చార్జిగా జిల్లా సంయుక్త కలెక్టర్ వ్యవహరిస్తారని తెలి పారు. ప్రతి రిటర్నింగ్ అధికారి వారి ప్రణాళికలను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని స్పష్టం చేశారు. అనుకూలంగా లేనిపోలింగ్ కేంద్రాల మార్పునకు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపించాలన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని కలెక్టర్ సూచించారు. ఈ ఎన్నికలకు ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు, డిప్యూటీ ఎలక్టోరల్ అధికారులుగా, తహశీల్దార్లు సహాయ ఎలక్టోరల్ అధికారులుగా వ్యవహరిస్తారన్నారు. మున్సిపల్‌ప్రత్యేక అధికారులు ప్రతి పోలింగ్ స్టేషన్‌ను తనిఖీ చేసి ఎన్నికలు ముగిసే వరకు వాటిని పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని, సూక్ష్మ పరిశీలకులను, వీడియోగ్రాఫర్లను నియమించుకోవాలని తెలిపారు.
పార్లమెంట్, శాసనసభ ఎన్నికలకు వర్తించే నియమావళి మున్సిపల్ ఎన్నికలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించి ఈ నెల 22నుం చి 27 వరకు ఓటర్లకు స్లిప్పులను పంపిణీ చేయాలని సూచించారు. మిగిలిన స్లిప్పులను పోలింగ్ రోజున అందజేయాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి.రామారావు, ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రజిత్‌కుమార్ సైనీ, సబ్ కలెక్టర్ శ్వేతామహంతి, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్‌ఎస్. వెంకటరావు, జిల్లా పరిషత్ సీఈఓ ఎన్.మోహనరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి జె.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.