డబ్బే డబ్బు
- ఏడాదికి మద్యం ద్వారా రూ.155 కోట్ల ఆదాయం
- షాపుల లెసైన్స్ ఫీజు ద్వారా రూ.107 కోట్లు
- దరఖాస్తు ఫీజు ద్వారా రూ.35 కోట్లు
- ప్రభుత్వం ఏర్పాటు చేసే షాపుల నుంచి రూ.13 కోట్లు
- ప్రభుత్వ షాపుల్లో అమ్మకాలతో వచ్చేది అదనం
- ఆగిపోయిన పది షాపులకు త్వరలో నోటిఫికేషన్
- అవి కూడా వస్తే మరింత ఆదాయం
ఒంగోలు క్రైం: జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం షాపులపై వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆదాయమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన మద్యం పాలసీ మేరకు జిల్లాలో సోమవారం ఉదయానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆదివారం రాత్రి ప్రారంభించిన టెండర్ల కార్యక్రమం సోమవారం ఉదయం 8 గంటల వరకు సాగింది. జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ల పరిధిలో ఒకేసారి టెండర్ల విధానాన్ని ప్రారంభించటంతో త్వరగా పూర్తయ్యాయి.
లేకుంటే సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగేది. జిల్లాలో మొత్తం 289 మద్యం షాపులకుగాను 279 షాపులకు దరఖాస్తులు వచ్చాయి. మొత్తం మీద కేవలం 10 షాపులకు దరఖాస్తులు అసలు పడనేలేదు. అయితే టెండర్లు తీసి షాపుల కేటాయింపులు జరిగిన వరకు ఏడాదికి మద్యం షాపుల లెసైన్స్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం రానుంది. ఈ మొత్తాన్ని లెసైన్స్‌దారులు ఆరు నెలల్లోపు షాపులకు కేటాయించిన లెసైన్స్ ఫీజును విడతల వారీగా ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది.
అయితే ఇప్పటికే దరఖాస్తుల అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.35 కోట్లు జమ అయింది. ఇకపోతే జిల్లాలో ప్రభుత్వం తరఫున మొత్తం 32 మద్యం షాపులు నిర్వహించాల్సి ఉంది. ఇవి ఒంగోలు ఈఎస్ పరిధిలో 15, మార్కాపురం ఈఎస్ పరిధిలో 17 ఉన్నాయి. వీటన్నింటికి సాధారణంగా ప్రభుత్వం కేటాయించిన లెసైన్స్ ఫీజు ప్రకారం లెక్కలేస్తే మొత్తం రూ.13 కోట్ల ఆదాయం రానుంది. లెసైన్స్ ఫీజు కాకుండా ఏడాది పొడవునా మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం అదనం అన్న మాట. అమ్మకాల ద్వారా అదనంగా మరో ఏడెనిమిది కోట్లు ఆదాయం రావచ్చని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే దరఖాస్తులు రాకుండా ఆగిపోయిన పది మద్యం షాపులకు త్వరలో ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఆగిపోయిన వాటిలో ఒంగోలు ఈఎస్ పరిధిలో 7 షాపులు, మార్కాపురం ఈఎస్ పరిధిలో 3 షాపులు, చీరాల పరిధిలో ఆరు షాపులు ఉన్నాయి. వీటితో పాటు సింగరాయకొండ, జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు, కనిగిరి మండలం పెదఅలవలపాడు, పర్చూరు మండలం నూతలపాడులో షాపులకు దరఖాస్తులు రాలేదు. వీటికి కొత్తగా దరఖాస్తులు వస్తే తిరిగి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతుంది.