పాలూ మండుతున్నాయ్
- లీటర్‌పై రూ.2 పెంచిన ప్రైవేటు డెయిరీలు
- ఆర్నెల్లలో మూడో సారి
- రెండు రోజుల్లో విజయ డెయిరీ వంతు
కొడవలూరు : కొండెక్కి కూర్చున్న నిత్యావసర సరుకులు, కూరగాయలు, గ్యాస్ తదితర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడిపై మరోసారి పాలపిడుగు పడింది. ప్రైవేటు డెయిరీలు బుధవారం నుంచి లీటర్‌కు రూ.2 పెంచాయి. పాల ధర పెరగడం ఆర్నెల్లలో ఇది మూడోసారి. ఈ ఏడాదిలో జనవరి 13న లీటరుకి రూ.2 పెంచగా, మార్చి 10న రూ.2 పెంచగా తాజాగా మరోసారి భారం వేశారు. ఈ మేరకు ఇప్పటికే ప్రైవేటు డెయిరీలు ప్రకటించి అమలు చేస్తుండగా, విజయ డెయిరీ శుక్ర, లేదా శనివారాల్లో ధరల పెంపును ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసింది.
ధరల పెంపుతో పాల వినియోగదారులపై నెలకు అదనంగా రూ.42 లక్షల భారం పడుతుంది. జిల్లాలో సుమారు 15 వరకు పాల డెయిరీలు ఉండగా విజయ డెయిరీ మాత్రమే సహకార రంగంలో నడుస్తోంది. మిగిలినవన్నీ ప్రైవేటు డెయిరీలే. అయితే పాలు, పాల ఉత్పత్తుల అమ్మకంలో విజయ డెయిరీదే సింహభాగం. మొత్తం మీద రోజుకు 70 వేల లీటర్లు పాలు విక్రయిస్తుండగా అందులో విజయ డెయిరీ వాటా 18 వేల లీటర్లు. గతంలో పాల ధర పెంపును విజయ డెయిరీ మొదట ప్రకటించగా ఈ సారి ప్రైవేటు డెయిరీలు ముందు నిలిచాయి. దీంతో రూ.46గా ఉన్న లీటరు పాల ధర రూ.48కి చేరుకుంది.
కుంటి సాకులు : పాల ధర పెంపునకు ఖర్చుల పెరుగుదల, సేకరణ ధర పెంపే కారణాలని డెయిరీ వర్గాలు చెబుతున్నా వాస్తవ పరిస్థితి చూస్తే అవి కుంటి సాకులేనని తెలుస్తోంది. పాల సేకరణ ధర పెంచింది ఒకసారి మాత్రమే. పది శాతం వెన్న ఉంటే లీటరుకు రూ.48 చెల్లిస్తామని ప్రకటించారు. రైతులు తెచ్చే పాలలో ఆరు నుంచి ఏడు శాతం మాత్రమే వెన్న ఉంటుంది. లీటర్‌కు రూ.35 నుంచి రూ.37 వరకు చెల్లిస్తున్నారు. పాల రవాణాకు మాత్రమే డీజిల్‌ను వినియోగిస్తున్నారు. వీటిని సాకుగా చూపి తరచూ పాల ధరను పెంచడం సబబా అని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.