
సాక్షి, అమరావతి : వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకూ విస్తరించాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగారు. పెట్టుబడులు రావడంలో సగటున 54 శాతం వృద్ధి నమోదు కావడమే కాకుండా.. పెట్టుబడుల ఆకర్షణలో ఏడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. 2007–08లో ఆర్‌బీఐ గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఈ స్థాయి వృద్ధి రేటును అంతకు ముందు ముఖ్యమంత్రులుగానీ.. ఆయన మరణించాకగానీ ఎవ్వరూ అందుకోలేకపోయారు. ఐటీ, ఇన్‌ఫ్రా, ఫార్మా, తయారీ, బయోటెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్.. ఇలా అన్ని రంగాలకూ ప్రాధాన్యం ఇచ్చారు.
శంషాబాద్ ఎయిపోర్టు, పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే, బయోటెక్నాలజీ పార్క్, కృష్ణపట్నం పోర్టు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, కైజెన్ టెక్నాలజీస్ వంటి అనేక ప్రాజెక్టులు వైఎస్ హయాంలోనే ప్రారంభమయ్యాయి. ఓడరేవు, నిజాంపట్నం, బందరు పోర్టు, విశాఖ–కాకినాడ పెట్రో కారిడార్, ఎన్‌టీపీసీ–బీహెచ్‌ఈఎల్, బ్రాహ్మణీ స్టీల్స్ వంటి అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసినా ఆయన మరణం తర్వాత వీటిలో కొన్ని ప్రాజెక్టులు ఒక అడుగు కూడా ముందుకు పడకపోగా.. కొన్ని అటకెక్కాయి. వైఎస్ శంకుస్థాపన చేసిన బందరు పోర్టు పనులను ఇప్పటికీ ప్రారంభించలేదు. ఎన్‌టీపీపీసీ–బీహెచ్‌ఈఎల్ ప్రాజెక్టు మూసివేత దిశగా సాగుతోంది.
పెట్టుబడుల వరద..
వైఎస్ హయాంలో అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల విలువలో 269 శాతం వృద్ధి నమోదైంది. చంద్రబాబుసీఎంగా ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రానికి రూ.11,659 కోట్ల విలువైన పెట్టుబడులొస్తే.. వైఎస్ ఐదేళ్ల కాలంలో ఏకంగా రూ.43,117 కోట్ల విలువైన పెట్టుబడులొచ్చాయి.