ఒక్క నిమిషం.. ఆలోచించండి! | Inter Students Suicide For Fail In Exams | Sakshi
Sakshi News home page

ఒక్క నిమిషం.. ఆలోచించండి!

Published Sat, Apr 13 2019 11:31 AM | Last Updated on Sat, Apr 13 2019 11:31 AM

Inter Students Suicide For Fail In Exams - Sakshi

ఓటమి గెలుపునకు నాంది... ఓడిపోయామని నిరుత్సాహానికి గురికాకుండా మరింత ధైర్యాన్ని గుండెల్లో నింపుకొని తదుపరి విజయంకోసం శ్రమించాలి. విజయం సాధించి చూపాలన్న కసిని పెంచుకోవాలి. ఓటమితో కుంగిపోతే చంద్ర మండలానికి వెళ్లగలిగేవాళ్లమా? ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఆధునిక సదుపాయాలు అందుబాటులోనికి వచ్చేవా? ఎన్నో ఓటముల తరువాత కానీ ఆయా రంగాల్లోని శాస్త్రవేత్తలు విజయం సాధించారన్నది అంతా గుర్తించాలి. అలాగే పరీక్ష తప్పినంత మాత్రన కోల్పోయేది ఏమీ లేదు. ‘మనం’ అనేవాళ్లం ఉంటే.. ఉజ్వలమైన భవిష్యత్‌ మనముంగిటే చేరుతుంది. విజయాలు కూడా మనసొంతమే అవుతాయి. ఆలోచించండి..!   

శ్రీకాకుళం న్యూకాలనీ:  ఏప్రిల్, మే నెలలు పరీక్షా ఫలితాలు విడుదలయ్యే సమయం. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, పలు ఉన్నత కోర్సుల ఫలితాలు వెలువడుతుంటాయి. ఇప్పటకే శుక్రవారం ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలు కొంతమందికి తియ్యదనాన్ని.. మరికొందరికి చేదు జ్ఞాపకాలను మిగల్చడం సహజం. గ్రేడింగ్‌ విధానంలో వెలువడిన ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్ధులు అర్భుత ఫలితాలను సాధించి, రాష్ట్రస్థాయిలో రికార్డులు సృష్టించారు. అదే సమయంలో జిల్లాకు చెందిన మరికొంత మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఆవేదనకు గురి చేస్తున్నారు. పరీక్ష తప్పామన్న ఆవేదనతో, తమ స్నేహితులు, బంధువుల వద్ద తలెత్తు కోలేమోనని క్షణికావేశానికి లోనవుతున్నారు. గతంలో పరీక్ష ఫలితాల ప్రభావంతో ప్రాణాలు తీసుకున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. మరిందరు సమాచారం బయటకు తెలీయనీయడం లేదు. ఇటువంటి ఘటనలు తల్లిదండ్రులను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉండగా... మేలో పదో తరగతి, డిగ్రీ, పలు ప్రెవేశ పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి.

ప్రశాంతంగా ఆలోచించాలి...
ఫలితాలు ఎలా ఉన్నా.. కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకుని ఆత్మవిమర్శ చేసుకుంటే చాలని, అనవసరంగా ఆందోళనకు, ఒత్తిడికి గురై, తప్పుడు దారులు వెతకరాదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఓటమి విజయానికి తొలిమెట్టు వంటిదని, అంతమాత్రాన నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నది వీరి సూచన. ఎందుకు ఓడిపోయాం? కారణమేమై ఉంటుంది? మరోసారి అలాంటి తప్పులు చేయను.. అనే విధంగా దానిని సరిదిద్దు కునేందుకు మళ్లీ ప్రయత్నిస్తే, విజయం తప్పక వరిస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఉత్తీర్ణత సంతోషాన్ని, బలాన్ని ఇస్తే.. ఓటమి విజయానికి బాటలు వేస్తుందన్న నిత్య సత్యాన్ని ప్రతిఒక్కరూ గమనించాలని సూచిస్తున్నారు. కష్టపడి చదవాలి. మంచిమార్కులు సాధించాలన్న లక్ష్యంతో దూసుకుపోవాలి. మన చిత్తశుద్ధిలో లోపం లేకుంటే ఫలితం ఎలా ఉన్న పట్టించుకోవాల్సిన అవసరం లేదని విద్యావేత్తల అభిప్రాయం.

తల్లిదండ్రులూ.. ఇవి మీకే..
తమ పిల్లలు అనుకున్న మార్కులు సాధించలేదనో, పాస్‌ కాలేదనో వారిని మందలించ వద్దు.
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పోల్చుతూ హేళనగా మాట్లాడకూడదు.
ఫలితాల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.
ఫలితాలు అనుకూలంగా వస్తే ఫరవాలేదు. ప్రతికూలంగా వస్తే.. వారు తీవ్ర నిరాశకు గురవుతుంటారు. అటువంటి సమయంలో వారిని అక్కున చేర్చుకోవాలి.
జరిగిన పొరపాటు గురించి పిల్లలతో సున్నితంగా చర్చించి, మీమున్నామన్న భరోసాను ఇవ్వగలగితే వారికిక తిరుగేలేదు.

విద్యార్థులకు సూచనలు..
పాస్, ఫెయిల్‌ అన్నవి అత్యంత సాధారణ విషయాలుగా భావించాలి.
జీవితం ఎంతో విలువైనది. భవిష్యత్‌లో ఎన్నో విజయాలు సాధించవచ్చన్న సానుకూల దృక్పథంతో ఆలోచించాలి.
ఫలితాలతోనే జీవితం ముడిపడి ఉందని భావించకూడదు.
అనుకూల ఫలితాలైతే ఫర్వాలేదు. అదే ప్రతికూలమైతే సానుకూలంగా స్వీకరించే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి.
వ్యతిరేక ఫలితం ఎదురైతే కాసేపు ప్రశాంతంగా ఆలోచించాలి. పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు మరోసారి పునశ్చరణ చేసుకోవాలి.
మన ప్రయత్న లోపం లేనప్పుడు జరిగిన పొరపాటుకు కారణాలను విశ్లేసించుకోవాలి.
జరిగిన పొరపాటుకు కుంగిపోకుండా మనసులో ఆత్మస్థైర్యాన్ని నింపుకోవాలి.
ఒత్తిడి నుంచి వేగంగా బయటపడే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులతో చర్చించి వారి నైతిక మద్దతు పొందాలి.
జరిగిన తప్పును వీలైనంత వరకు తల్లిదండ్రులకు చెప్పుకుంటే 90 శాతం భారం దిగిపోయినట్లేనని గ్రహించాలి.
విజయం మనదేనని నిశ్చయించుకుని, పట్టుదలతో చదువుతూ పూర్తిస్థాయిలో ఏకగ్రత పెంచుకోవాలి.
వెనుకబడిన సబ్జెక్టులు లేదా పాఠ్యాంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించి.. అవసరమైతే అధ్యాపకులు, సీనియర్ల సూచనలు, సలహాలను తీసుకోవాలి.
పై సూచనలను ఆచరించడానికి ప్రయత్నించాలే తప్ప, ఫెయిలైనంత మాత్రన ప్రాణాలు తీసుకోవాలనే కఠిన నిర్ణయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పోకూడదు.
తొందరపాటు నిర్ణయాల వల్ల తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎంత క్షోభకు గురవుతారోనని ఒక్క క్షణం ఆలోచించాలి.

పది రెండుసార్లు తప్పాను
నేను పదో తరగతి రెండు సార్లు తప్పాను. మూడో సారి పాసయ్యాను. అంతమాత్రాన ఎటువంటి నిరుత్సాహానికి గురికాలేదు. పైగా ఆరోజు ఫెయిలవ్వడమే అదృష్టమని ఎప్పుడూ భావిస్తుంటాను. అదే నాలో కసి పెంచింది. అదే స్ఫూర్తిగా తీసుకుని ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా అన్నింటిలోనూ ప్రతిభ కనబరచ గలిగాను. చివరికు నేను డిగ్రీ చదవుకున్న కళాశాలకే ప్రిన్సిపాల్‌ అయ్యే అదృష్టాన్ని సొంతం చేసుకోగలిగాను. విద్యార్థులు ఎటువంటి నిరుత్సాహానాకి గురికావద్దు. ఉజ్వలమైన భవిష్యత్‌ ముందు ఉందనే విషయాన్ని ఎప్పుడూ మరవకండి.– బమ్మిడి పోలీసు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement