సాక్షి, విశాఖపట్నం : పరిశ్రమల్లో ట్రయిల్ రన్ దశలో ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు మొదలయ్యాయి. ప్రమాదాల నియంత్రణకు కొత్త చట్టం రాబోతోంది. చమురు, పెట్రోలియం, ఫార్మా వంటి భారీ ఉత్పాదక పరిశ్రమల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఏ క్షణాన ఎలాంటి ప్రమాదం జరిగి ఎంత ప్రాణ నష్టం చోటుచేసుకుంటుందో ఊహించడమే కష్టం. ఇలాంటి సందర్భాల్లో ఆయా యాజమాన్యాల తప్పిదాలపై చర్యలు తీసుకునేందుకు స్పష్టమైన నిబంధనలున్నాయి. కానీ కంపెనీలు కొత్తగా ఉత్పత్తి ప్రారంభించేముందు సన్నాహక ప్రక్రియలో భాగంగా నిర్వహించే ట్రయిల్ రన్‌లో ప్రమాదం జరిగితే..పెద్ద ఎత్తున ప్రాణ నష్టం చోటుచేసుకుంటే ఏం చేయాలి?, అటువంటి కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి?... అంటే అధికారులు చెప్పలేకపోతున్నారు.
ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా ప్రమాదాలు సంభవిస్తే పరిశ్రమలు, రెవెన్యూ, పోలీస్, కాలుష్య నియంత్రణ బోర్డు వంటి శాఖల పరిధిలోకి వస్తాయి కాబట్టి చర్యలు తీసుకుంటాయి. కంపెనీ స్థాపన తర్వాత, ఉత్పత్తికి ముందు ఈ రెండు ప్రక్రియలకు మధ్య జరిగే కీలక ట్రయిల్ రన్ దశలో ప్రమాదాలు జరిగితే ఏం చేయాలనేది ఇప్పుడు అధికారులకు అంతుపట్టడంలేదు. ఎందుకంటే కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాలనుకునే ముందు అసలు ఫ్యాక్టరీ ఎలా నడుస్తుంది?, యంత్రాలు సరిగ్గా పనిచేస్తున్నాయా?, ఉత్పత్తి ఎలా వస్తుంది?, లోపాలేవైనా ఉన్నాయా? వంటి విషయాలు పరిశీలించి సరిదిద్దేందుకు ట్రయిల్ రన్ నిర్వహిస్తాయి. దీన్నే కమిషనింగ్ స్టేజ్ అంటారు. అలా నిర్వహించే అత్యంత కీలకమైన ఈ దశలోనే అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఫార్మా, కెమికల్, ఆయిల్, పెట్రోలియం పరిశ్రమల్లో ఇవి మరీ ఎక్కువ. అలా కమిషనింగ్ సమయంలో జరిగే ప్రమాదాలకు సంబంధించి వాటి నివారణకు ఏం చేయాలి? ఎవరిని బాధ్యులు చేయాలి? అటువంటి ప్రమాదాల నివారణ ఏ శాఖ కిందకు వస్తుంది? అనే దానిపై స్పష్టత లేక ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియకఅధికారులు తల పట్టుకుంటున్నారు. ఇటీవల విశాఖలోని హెచ్‌పీసీఎల్‌లో కూలింగ్ టవర్ పేలిన నేపథ్యంలో మరోసారి ఈ సమస్య తెరపైకి వచ్చింది. ఇక్కడ కూలింగ్ టవర్ నిర్మాణం దాదాపు పూర్తయిన దశలో ట్రయిల్ రన్ నిర్వహిస్తున్నప్పుడు 25 మంది వరకు మృతి చెందారు. ఇప్పుడు ఆ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై నిబంధనలు లేక ప్రభుత్వపరంగా అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. అందుకోసం కమిషనింగ్ స్టేజ్ పేరుతో కొత్త కంపెనీల చట్టాన్ని రూపొందించాలని భావిస్తున్నారు.
అలా అయితేనే ప్రమాదాలకు అడ్డుకట్ట
పేలుడు, ఇతర ప్రమాదకరమైన పరిశ్రమలకు వర్తించేలా కేవలం ఫ్యాక్టరీ ఎలా పనిచేస్తుంది అనే దానికోసం నిర్వహించే ట్రయిల్న్ ్రవిధానానికి మాత్రమే వర్తించేలా ఈ చట్టాన్ని రూపొందించాలని భావిస్తున్నారు. ఇందుకోసం పెట్రోలియం, రసాయనాలు, ఫార్మా, బల్క్‌డ్రగ్స్, చమురు వంటి కంపెనీలు అధికంగా ఉన్న విశాఖ జిల్లాలో ఫ్యాక్టరీస్ శాఖ అధికారులు ఈ చట్టం ఏ విధంగా ఉంటే బావుంటుంది?, ఏయే నిబంధనలుండాలి?, ట్రయిల్ రన్ స్థాయిలో జరిగే పేలుళ్లు, ప్రమాదాలకు ఎవరిని ఏ విధంగా బాధ్యత వహించేలా చేయాలి?, ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?అనే నిబంధనలు రూపొందించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. విశాఖలో వందలాది కంపెనీలు విస్తరణ పనులతోపాటు, ట్రయిల్న్ ్రనిర్వహించే ముందు కనీసం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడంలేదు.
ఇందుకోసం త్వరలోనే ఆయా పరిశ్రమలతో మాట్లాడ్డం, నిపుణులతో సంప్రదింపులు చేయాలని ఫ్యాక్టరీస్ శాఖ నిర్ణయించింది. ప్రస్తుతం సమైక్య సమ్మె ముగిసినందున చట్టం రూపకల్పనకు తాజాగా నడుంబిగించింది. సుమారు ఏడు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే విశాఖలోని హెచ్‌పీసీఎల్, హెరిటేజ్, ఫార్మా కంపెనీల్లో వరుసగా చోటుచేసుకున్న ప్రమాద ఘటనల నేపథ్యంలో కలెక్టర్ ద్వారా ఇటువంటి చట్టం అవసరాన్ని వివరిస్తూ ప్రీస్టార్టప్ సేఫ్టీ రివ్యూ పేరుతో నిబంధనలు తయారుచేసి కొత్త చట్టం విదివిధానాలు తయారుచేసి పంపించనున్నారు.