ముఖ్యమంత్రి పర్యటనలో మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఇచ్చిన వినతి పత్రం హెలిప్యాడ్ వద్దే పడి ఉండటంపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు
ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి వినతిపత్రంపై విచారణ.. సీఎం ఆదేశం
మదనపల్లె: ముఖ్యమంత్రి పర్యటనలో మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఇచ్చిన వినతి పత్రం హెలిప్యాడ్ వద్దే పడి ఉండటంపై విచారణ జరిపించాలని సీఎం చంద్రబాబు జిల్లా అధికారులకు, టీడీపీ జిల్లా అధ్యక్షునికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 9న మదనపల్లె రూరల్ కాట్లాటపల్లి వద్ద హంద్రీ-నీవా సొరంగం పనులను పరిశీలించేందుకు వచ్చిన సీఎంకు స్థానిక ఎమ్మెల్యే తిప్పారెడ్డి నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 13 పేజీల వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ పత్రం హెలిప్యాడ్ వద్దే పడేసి ఉండటాన్ని మర్నాడు గుర్తించారు. దీనిపై ‘సాక్షి’లో సోమవారం ‘ఎమ్మెల్యేకు అవమానం’ అన్న కథనం ప్రచురితమైంది.
అధికారుల విచారణ: వినతి పత్రంపై ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఇందులో భాగంగా సాక్షి రిపోర్టర్‌ను కూడా ప్రశ్నించారు. హెలిప్యాడ్ వద్ద వినతి పత్రంలోని అన్ని పేజీలు పడిపోయాయా..? లేక కొన్ని పేజీలు మాత్రమే జారి పడ్డాయా..? అని ప్రశ్నించారు. మొత్తం 13 పేజీలు అక్కడే పడిపోయాయని తెలియడంతో వారు ఆ సమాచారం జిల్లా పోలీసు అధికారులకు అందజేశారు. దీనిపై మదనపల్లె సబ్‌కలెక్టర్ కృతికా భాత్రా కూడా విచారించారు. సాక్షి రిపోర్టర్‌కు కూడా ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.