సాక్షి, గుంటూరు: గుంటూరు మిర్చియార్డులో జరిగిన అక్రమాల విషయంలో ప్రభుత్వం మొదటి నుంచీ అలసత్వాన్ని కనబరిచింది. అధికారులందరూ తమకేమీ పట్టనట్టు మిన్నకుండిపోయారు. దీంతో కిందిస్థాయి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఫలితంగా నిబంధనలను గాలిలో కలిశాయి. పలు అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకున్నాయి. లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఒక్కమాటలో చెప్పాలంటే అక్రమాల్లో అందరూ దొంగలేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఎన్.శివరామయ్య, వి. హరినారాయణలు యార్డు కార్యదర్శులుగా పనిచేసిన రోజుల్లో 11 మంది సూపర్‌వైజర్లు నిబంధనలు ఉల్లంఘించి సుమారు 193 మంది కమీషన్ ఏజెంట్ల లెసైన్స్‌లు బదిలీ చేశారన్నది ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. ఈ కారణంతోనే వీరిపై సోమవారం సస్పెన్షన్ వేటు వేసింది. అధికారులను తప్పుదోవ పట్టించి ఒక్కొక్కరూ లెసైన్సుల బదిలీల్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వం పేర్కొంది. అయితే లెసైన్సులు బదిలీ చేసే అధికారం సూపర్‌వైజర్లకు ఉందో, లేదోనన్న విషయాన్ని మాత్రం విస్మరించింది.
ఒక వేళ సూపర్‌వైజర్లు అధికారులను తప్పుదోవ పట్టించి అనధికారిక ంగా లెసైన్స్‌లు బదిలీ చేస్తుంటే, అప్పట్లో ఉన్న యార్డు పాలకవర్గం, కార్యదర్శులు ఏం చేస్తున్నారన్న ప్రశ్న వినిపిస్తోంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు..ఏకంగా 11 మంది సూపర్‌వైజర్లు 193 మంది ఏజెంట్ల లెసైన్స్‌లు మారుస్తున్నపుడు ఎవరూ గుర్తించలేదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంలో అధికారుల తీరు కూడా విస్మయాన్ని కలిగిస్తోంది. యార్డులో ఇప్పటికీ అనధికార లెసైన్సులు కలిగివున్న వ్యాపారులు లెసైన్సు ఫీజు లేకుండా వ్యాపారం చేస్తున్నా ఎవరూ పట్టించు కోవడం లేదు.
వీరి లెసైన్స్‌లు బదిలీ చేయడం తప్పయినపుడు లెసైన్స్ ఫీజు చెల్లించకుండా వీరు చేస్తున్న వ్యాపారం ఏ మేరకు చట్టబద్ధమైనదో అర్థం కావడం లేదు. వీరి విషయంలో మార్కెటింగ్‌శాఖ అధికారులు మిన్నకుండిపోవడంలో ‘అర్థ’మేంటో తెలియడం లేదు. లెసైన్స్‌లు రెన్యువల్ చేయించుకోకుండా వ్యాపారం చేస్తున్న వారి విషయంలోనూ అధికారులు మౌనంగా వ్యవహరిస్తున్నారన్నది మరో ఆరోపణ. ఈ విషయాలన్నింటినీ పక్కన పెట్టి అక్రమాలకు కేవలం సూపర్‌వైజర్లే కారణమన్న చందాన సస్పెన్షన్ల వేటు వేయడం ఎంత వరకు సమంజసమంటూ కొందరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వివరణ కూడా అడగకుండా ఒకే ఆర్డర్‌లో చార్జిమెమో, సస్పెన్షన్ ఉత్తర్వులు ఇవ్వడం చూస్తుంటే అధికారుల తీరు విస్మయాన్ని కలిగిస్తోంది.
కింకర్తవ్యం..
ఇదిలా ఉండగా సస్పెన్షన్ వేటు పడిన కొందరు ఉద్యోగులు మంగళవారం గుంటూరులో సమావేశమైనట్లు తెలిసింది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకున్నట్లు సమాచారం. గుంటూరులోని కీలకమైన అధికారిని కలిసి రాగల ముప్పు నుంచి బయటపడేయమని కోరినట్లు తెలిసింది.
అధికారుల అలసత్వం అక్రమాలకు ఆజ్యం
Published Wed, Dec 25 2013 2:26 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
Advertisement
Advertisement