ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశంపార్టీలో ఆధిప్యతపోరు తారస్థాయికి చేరింది. ఇది ఒకరి ఆర్థిక వనరులను మరొకరు దెబ్బతీసే స్థాయికి చేరింది. దీంతో అంతర్గతపోరు బహిరంగమై ‘నువ్వా–నేనా’ అని పరస్పరం కత్తులు దూసేస్థాయికి నేతలు చేరారు. టీడీపీలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కొంతకాలంగా ఆధిపత్యపోరు నడుస్తున్నా ఇటీవల దాఖలైన రోడ్డు టెండర్లలో మరోసారి బట్టబయలయ్యాయి. ముఖ్యంగా మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య నెలకొన్న విభేదాలపై జిల్లా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. సునీత ఆర్థిక వనరులు దెబ్బతీసేందుకు ప్రతీ పనిలో సూరి పోటీపడుతున్నారని సునీత వర్గం ఆరోపిస్తుంటే, సూరిని దెబ్బతీసేందుకు మంత్రి సునీత ఐటీదాడులు జరిగేలా పథకం రూపొందించారని సూరీ వర్గం ఆరోపిస్తోంది.
రెండు నియోజకవర్గాల్లోనూ టెన్షన్ టెన్షన్
మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలతో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో కొంతకాలంగా ప్రశాంత వాతావరణం కరువైంది. వీరి విభేదాలు ఏ క్షణం ఎలాంటి గొడవలకు దారితీస్తాయో అని ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఇటీవల ధర్మవరం పరిధిలోని చెరువులకు నీరివ్వలేదని హంద్రీ–నీవా ఎస్‌ఈ కార్యాలయం ముందు సూరి ధర్నాకు దిగారు. ధర్మవరం చెరువులకు నీరివ్వకుండా సునీతనే అడ్డుపడుతున్నారని సూరి వర్గం ఆరోపించింది. ఈ క్రమంలో బత్తలపల్లి–అనంతపురం, అనంతపురం–కళ్యాణదుర్గం, కళ్యాణదుర్గం–రాయదుర్గం రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి టెండర్లలో వీరిద్దరూ పోటీపడ్డారు.
బత్తలపల్లి–అనంతపురం రహదారి పనుల్లో ఎక్కువగా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ పనులకు సూరితో పాటు సునీత కూడా తమ అస్మదీయులతో టెండర్లు దాఖలు చేయించారు. ధర్మవరం నియోజకవర్గంలోని పనుల్లో సునీత జోక్యం చేసుకుని టెండర్లు వేయించడం సూరీకి మింగుడు పడలేదు. దీంతో అనంతపురం–కళ్యాణదుర్గం రోడ్డు పనులకు సూరి టెండర్లు వేయించాడు. ఈ రోడ్డు ఎక్కువగా రాప్తాడు పరిధిలో ఉంటుంది. ఇంతటితో ఆగకుండా ఈ ఇద్దరూ కళ్యాణదుర్గం– రాయదుర్గం రోడ్డు పనులకు కూడా టెండర్లు వేయించారు.
టెండర్ల రోజునే ఐటీ దాడులు
అనంతపురం–కళ్యాణదుర్గం రహదారి పనులకు ఈ నెల 15న టెండర్ల ప్రక్రియ ముగిసింది. అదేరోజు ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీకి చెందిని నితిన్‌సాయి కన్‌స్ట్రక్షన్స్ కార్యాలయాలతో పాటు ఆయనకు సంబంధించి ఆఫీసుల్లో ఐటీ దాడులు జరిగాయి. బెంగళూరుకు చెందిన ఐటీ అధికారులు దాడులకు వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగేళ్లలో సూరి ఆస్తులు భారీగా పెరిగాయని, అక్రమార్జన ద్వారా భారీగా అర్జించారని ఐటీ అధికారులకు మంత్రి వర్గీయులే సమాచారం అందించి దాడులు చేసేలా పథక రచర చేశారని సూరీ వర్గం ఆరోపిస్తోంది.
అయితే నాలుగేళ్లలో సూరీ ఆస్తులు భారీగా పెరిగాయని, దీంతోనే ఐటీ అధికారులు దాడులు చేశారని, ఇందులో తమ ప్రమేయం లేదని సునీత వర్గం అంటోంది. ఎవరు దాడులు చేయించారనే సంగతి పక్కనపెడితే సూరీపై ఐటీ దాడుల అంశం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment