మరింత ఉధృతంగా ఉద్యమం : సమైక్య జేఏసీ
30వ తేదీ దాకా కార్యక్రమాల ఖరారు
24 సీమాంధ్ర బంద్.. 25, 26 ప్రైవేట్ ట్రావెల్స్ నిలిపివేత
23-30 ప్రైవేట్ విద్యా సంస్థల మూత
4 రోజులు బ్యాంకులు, కేంద్ర కార్యాలయాల బంద్
హైదరాబాద్:
సమ్మె స్థాయిని కూడా మించి సమైక్యోద్యమాన్ని ఉధృతం చేసే దిశగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు కార్యాచరణ ప్రణాళిక ఖరారు చేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఉద్యమం ఏకరీతిగా సాగడమే లక్ష్యంగా కార్యాచరణను ‘సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక’ జేఏసీ రూపొందించింది. జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు అధ్యక్షతన జేఏసీ సోమవారం సమావేశమైంది. ఏపీ ఎన్జీవో, ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం, ఆర్టీసీఈయూ, ఎన్‌ఎంయూ, డిప్యూటీ కలెక్టర్ల సంఘం, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం, మున్సిపల్ ఉద్యోగుల సంఘం, ట్రెజరీ ఉద్యోగుల అసోసియేషన్, గెజిటెడ్ అధికారుల సంఘం, అన్ని సంక్షేమ శాఖల ఉద్యోగుల సంఘం, సీమాంధ్ర ఉపాధ్యాయుల పోరాట సమితి.. ఇలా దాదాపు 145 సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉద్యోగులు, కార్మిక సంఘాలు సమ్మెతోనే సరిపెట్టొద్దని, కేంద్రంపై ఒత్తిడి పెరిగేలా కార్యాచరణ ఉండాలని అభిప్రాయం వ్యక్తమయింది. ఉద్యమంలో పాల్గొనని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆందోళనలో భాగస్వాములను చేసే లక్ష్యంతో ప్రణాళిక రూపొందింది. వివరాలిలా ఉన్నాయి...
- సెప్టెంబర్ 19, 20న కేంద్ర ప్రభుత్వ కార్యాయలయాలు, బ్యాంకుల దిగ్బంధం
- 21న సాయంత్రం 6-8 గంటల మధ్య సీమాంధ్ర అంతటా లైట్లు ఆర్పి నిరసన
- రాష్ట్ర సమైక్యత ఆవశ్యకతను వివరిస్తూ 22, 23ల్లో జిల్లా కేంద్రం నుంచి గ్రామ స్థాయి దాకా అవగాహన సదస్సులు
- 23 నుంచి 30వ తేదీ దాకా ప్రైవేట్ విద్యాసంస్థల బంద్
- 24న సీమాంధ్ర బంద్, రహదారుల దిగ్బంధం. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలనూ అడ్డుకోవాలని నిర్ణయం
- 25, 26ల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బంద్
- 27, 28ల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్
- రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ 30వ తేదీలోగా సీమాంధ్రలోని అన్ని పంచాయితీలూ తీర్మానాలు చేసి ప్రధానికి పంపాలి