జగన్ బెయిల్పై నేడు విచారణ
హైదరాబాద్ : బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ కోసం ఆయన నిన్న కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని పరిశీలించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ అంశంపై నేడు విచారణ జరగనుంది.
సీబీఐ విచారణను తాను ఏ విధంగానూ ప్రభావితం చేయకపోయినా 'సాక్షి' పెట్టుబడుల వ్యవహారంలో 15 నెలలకు పైగా తనను జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారని... ఇప్పటికైనా సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తనకు బెయిల్ మంజూరు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సీబీఐ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. జగన్ తరఫున న్యాయవాది జి.అశోక్‌రెడ్డి ఈ మేరకు సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్రంలో రాజకీయ శక్తిగా ఎదుగుతున్న ఏకైక పార్టీ వైఎస్‌ఆర్ సీపీయే నని ఈ విషయాన్ని జాతీయ మీడియా సైతం సర్వేలు జరిపి తేల్చిందని జగన్ తన పిటిషన్‌లో తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్రాన్ని విభజిస్తూ అధికార పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. విభజనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని... విభజనను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని జగన్ తన పిటిషన్‌లో తెలిపారు.
ఒక రాజకీయ పార్టీ అధినేతగా ప్రజలతో కలిసి వారి ఆకాంక్షల మేరకు పోరాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. వివాదాస్పద నిర్ణయంతో ఏర్పడిన ఉద్రిక్తతలను నివారించడానికి, శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడానికి తాను కీలకపాత్ర పోషించగలనన్నారు. ఈ అంశాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలని జగన్ తన పిటిషన్‌లో కోరారు.
కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి 2011 ఆగస్టు 17న జగన్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దాదాపు తొమ్మిది నెలల పాటు... విచారణలో అధిక భాగం పూర్తయి, మూడు చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత గత ఏడాది మే 27న అరెస్టుకు సరైన కారణాలు చూపకుండానే సీబీఐ అదుపులోకి తీసుకుంది.
తనను అరెస్ట్ చేసి 15 నెలలుగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచడం న్యాయ సమ్మతం కాదని.. తన హక్కులను హరించడమేనని జగన్ తన పిటిషన్‌లో తెలిపారు. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను, సాక్ష్యాలను సీబీఐ స్వాధీనం చేసుకుందని... అందుకని ఈ దర్యాప్తును అడ్డుకోవడం, సాక్ష్యాలను తారుమారు చేయటం అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.
సీసీ నంబర్ 8 చార్జిషీట్‌తోపాటు ఈ కేసు మొత్తానికి తన రిమాండ్ వర్తిస్తుందని, 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయకపోతే బెయిల్‌కు అర్హుడినని గత ఏడాది హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బెయిల్ అనేది నిబంధన... కేసు రుజువయ్యే వరకూ నిందితులందరినీ నిరపరాధులుగానే భావించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు అనేక కేసుల్లో స్పష్టం చేసింది.
నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐకి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఈ ఏడాది మే 9న తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు పూర్తయిన నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని జగన్ తన పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక కోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి నోటీసులు జారీచేస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది.