జగ్జీవన్‌రామ్ స్మారక భవనం
అమరావతిలో ఏర్పాటు: సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ: మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ స్మారక భవనాన్ని అమరావతిలో నిర్మిస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వ ఆధ్వర్యంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను ఇక్కడి ఎ-1 కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దళితులు, బలహీనవర్గాల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభ్యున్నతికోసం జగ్జీవన్‌రామ్ అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు. జగ్జీవన్‌రామ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వచ్చే జూన్ నాటికి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కాలనీలన్నింటికీ విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని, ప్రతి ఇంటికీ 50 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. దళితుల పిల్లలకోసం ప్రత్యేకంగా క్రీడల పాఠశాలను నెలకొల్పుతామన్నారు. ప్రతి దళితవాడకు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పారు. 14న అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని బలహీనవర్గాలకు 6 లక్షల ఇళ్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని సీఎం పేర్కొన్నారు.
కొనకళ్ల కూడా అంతటివారు కావాలి..
జగ్జీవన్‌రామ్, జ్యోతిరావ్ పూలే, అంబేడ్కర్ వంటివారు పుట్టిన ఏప్రిల్ నెలలోనే బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు జన్మించారని సీఎం అంటూ.. ఆయన కూడా ఆ మహానీయులంతటి వారు కావాలని ఆకాంక్షించారు. కొనకళ్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు విజయవాడ రామవరప్పాడు రింగ్‌రోడ్డు ప్రధాన కూడలి వద్ద ఉన్న జగ్జీవన్‌రామ్ విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు.
వర్గీకరణ ఊసెందుకు ఎత్తలేదు?: చిట్టిబాబు మాదిగ
ఇదిలా ఉండగా జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకల సందర్భంగా సీఎంను కలిసేందుకు యత్నించిన మాదిగ హక్కుల దండోరా నాయకులు జి.చిట్టిబాబు మాదిగ, విద్యాసాగర్, మరికొందరిని పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం మాట్లాడాలని కోరేందుకు వెళ్లగా పోలీసులు తమను అడ్డుకున్నారని చిట్టిబాబు మాదిగ తెలిపారు. జయంతి సభలో మాలమాదిగలంతా పాల్గొన్నారని చెబుతున్న సీఎం ఎస్సీ వర్గీకరణపై మాట్లాడకపోవడం అమానుషమని నిరసన వ్యక్తం చేశారు.