'జై ఆర్టీసీ, జై కిసాన్'
విజయవాడ: ఆర్టీసీ, రైతుల పరిస్థితి ఒకేవిధంగా ఉందని ఆర్టీసీ ఎండీ డాక్టర్ జె. పూర్ణచంద్రరావు అన్నారు. జై ఆర్టీసీ, జై కిసాన్ అనాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రోజు రోజుకు ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాల్లో ఆర్టీసీని ఒడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. డీజిల్ ధర పెరుగుతున్నా టిక్కెట్లు పెంచలేని పరిస్థితివుందన్నారు. సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మిక సంఘాలకు ఆయన సూచించారు.
ఆర్టీసీని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకపోతే వచ్చే నెల 11 నుంచి నిరవధిక సమ్మెకు దిగాలని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నిర్ణయించింది. ప్రభు త్వ లోపభూయిష్ట విధానాలే ఆర్టీసీ నష్టాలకు కారణమని, సంస్థను ఆదుకోవాలనే డిమాండ్‌తో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో సమ్మె చేస్తామని ఈయూ ప్రకటించిన సంగతి తెలిసిందే.