
సీతానగరం (రాజానగరం): ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుర్ర చెడిపోయిందని, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఎద్దేవా చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆమె పర్యటించి తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్రను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కర్నాటకలో బీజేపీ అధిష్టానం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందంటూ చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేయడాన్ని తప్పుబట్టారు. మరి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు చేసిందేమిటని విజయలక్ష్మి ప్రశ్నించారు.
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి తాను దోచుకున్న సొమ్ముతో కొనుగోలు చేసి, మంత్రులను కూడా చేసిన ఘనతను చంద్రబాబు మరిచారా? అని ఆమె అన్నారు. జన్మభూమి కమిటీల మాటే శాసనంగా నాలుగేళ్లుగా అర్హులైన వారికి పింఛన్లు రద్దు చేసి, ఎన్నికలు దగ్గర పడుతున్నందున ఇప్పుడు జన్మభూమి కమిటీలకు సంబంధం లేకుండా, అర్హులందరికీ పింఛన్లు ఇస్తామనడం ఓటర్లను మభ్య పెట్టేందుకే అన్నారు. జగన్‌కు ఘన స్వాగతం పలకడానికి జిల్లా ప్రజలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారని విజయలక్ష్మి అన్నారు.