శ్రమయేవ జయతే !
నిరుపేద కుటుంబంలో పుట్టానని ఆమె ఏనాడూ కుంగిపోలేదు. కుటుంబ పోషణ భారమై తల్లిదండ్రులు బాలసదనంలో చేర్పించినా అధైర్యపడలేదు. అహర్నిశలు కష్టపడి విద్యనభ్యసించారు. గురువుల నమ్మకాన్ని నిలబెడుతూ..తల్లిదండ్రుల ఆశలు నెరవేరుస్తూ ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. విధి నిర్వహణలో రాణిస్తూ అంచెలంచెలుగా పదోన్నతులు పొందుతూ కష్టేఫలి సూత్రానికి ఉదాహరణగా నిలిచారు. ఆమే కమలాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ జయలక్ష్మి.
కమలాపురం: పులివెందుల తాలూకా, తొండూరు మండలం గోటూరు గ్రామానికి చెందిన సాలెమ్మ, వెంకటేష్‌ల చివరి సంతానం జయలక్ష్మి. ఆమెకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. అసలే నిరుపేద కుటుంబం.. అపై సంతాన భారం ఎక్కువ. అలాంటి సమయంలో కడప అక్కాయపలెలోని ప్రాంతీయ బాలసదనం అధికారులు జయలక్ష్మిని తల్లిదండ్రుల సహకారంతో బాలసదనంకు తీసుకెళ్లారు.
నిరుపేదలను తీర్చి దిద్దే ఆ సంస్థలో తమ చిన్నారి చదవడానికి తల్లిదండ్రులు పూర్తి అంగీకారం తెలిపారు. 1 నుంచి 10వ తరగతి వరకు జయలక్ష్మి బాలసదనంలో చదవుకున్నారు. కడప గర్ల్స్ కళాశాలలో ఇంటర్ పూర్తి కాగానే అంగన్వాడీ వర్కర్‌గా ఉద్యోగంలో చేరారు. వేంపల్లె మండలం పాలమూరులో తొలిసారిగా ఆమె ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు.
1997లో పదోన్నతిపై గ్రేడ్-2 సూపర్‌వైజర్‌గా రాయచోటి నియోజకవర్గంలోని సుండుపల్లె మండలానికి సూపర్ వైజర్‌గా పని చేశారు. 2007లో బదిలీపై కమలాపురం వచ్చిన జయలక్ష్మి 2013లో గ్రేడ్-1 సూపర్ వైజర్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం కమలాపురం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని వీఎన్ పల్లె మండలంలో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
ప్రతిభకు దక్కిన పురస్కారం..
బాలసదనంలో చదివి ఉన్నత స్థానం పొందిన వారిని ఈనెల 14న విజయవాడలో జరిగిన చిన్నారుల దినోత్సవ వేడుకల్లో సన్మానించారు. అందులో భాగంగా జిల్లా నుంచి జయలక్ష్మిని సన్మానించారు. గోల్డ్ మెడల్, మెమెంటో, ప్రశంసా పత్రాలను ప్రిన్సిపల్ సెక్రటరి నీలం సహాని, మంత్రి పీతల సుజాత చేతుల మీదుగా అందుకుని శభాష్ అని పించుకున్నారు. ఈ అవార్డుకు ఎంపికైం ది జిల్లానుంచి ఈమె ఒక్కరే కావడం విశేషం. ఈ సందర్భంగా స్థానిక సీడీపీఓ శ్రీమతమ్మ, ఇతర సూపర్‌వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఆమెను మంగళవారం అభినందించారు.