డ్రైవర్‌ను కులంపేరుతో దూషించిన ఎమ్మెల్యే జేసీ! | JC Prabhakar Reddy Vs Prabodandha In Aantapur | Sakshi
Sakshi News home page

కక్షగట్టి..చిచ్చురగిల్చి

Published Mon, Sep 17 2018 8:43 AM | Last Updated on Mon, Sep 17 2018 1:34 PM

JC Prabhakar Reddy Vs Prabodandha In Aantapur - Sakshi

తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామ సమీపంలోని ఆశ్రమం దగ్గర దగ్ధమవుతున్న వాహనాలు

అనంతపురం, తాడిపత్రి: ఒక ఆధ్యాత్మిక కేంద్రం....చిన్న పాకలో ప్రారంభమై...భక్తుల విరాళాలతో అభివృద్ధి చెందుతూ వచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కానీ ఆశ్రమ నిర్వాహకులు స్థానిక అధికార పార్టీ నేతలకు సలాం చేయడం లేదు.  దీంతో అధికారపార్టీ నేతలు అడ్డంకులు సృష్టించారు. అనుచరులతో కలిసి దాడులకు ప్రణాళిక రచించారు. అంతిమంగా తాడిపత్రిలో మంటలు రగిలించారు. సామాన్యులు బలవుతుంటే చోద్యం చూస్తున్నారు.

కేసుపెట్టినా...అరెస్టు చేయని పోలీసులు
తాడిపత్రి మండలంలోని చిన్నపొలమడలో‘శ్రీకృష్ణాశ్రమం’ పేరుతో ప్రభోదానంద ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అదనపు భవనాలు నిర్మించాలని భావించారు. నిర్మాణానికి కావాల్సిన ఇసుక కోసం అధికారులను నుంచి అనుమతులు  తీసుకున్నారు. అనంతరం 2017 జూన్‌లో పెద్దపప్పూరు మండలం నుంచి ఆశ్రమ నిర్వాహకులు ఇసుకను తరలిస్తుండగా అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇసుకను తరలిస్తున్న లారీలను అడ్డగించి దళితుడైన డ్రైవర్‌ వెంకటేశును కులం పేరుతో దూషించారు. అంతేకాకుండా అతనిపై దాడి చేసి ఇసుకను తరలిస్తున్న లారీలను స్వాధీనం చేసుకుని పెద్దపప్పూరు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. దీంతో లారీ డ్రైవర్‌ వెంకటేశు పోలీసులను ఆశ్రయించాడు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తనను కులంపేరుతో దూషించి దాడి చేశాడని ఆశ్రమ నిర్వాహకులతో కలిసి పెద్దపప్పూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎమ్మెల్యే జేసీపై కేసు నమోదు చేసేందుకు వెనుకంజ వేశారు. దీంతో బాధితుడు ఆశ్రమ నిర్వాహకులతో కలిసి మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. మానవహక్కుల కమిషన్‌ ఆదేశాల మేరకు పెద్దపప్పూరు పోలీసులు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిపై అప్పట్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయినా ఎమ్మెల్యేను మాత్రం అదుపులోనికి తీసుకోలేదు. 

అక్రమ కట్టడాలపేరుతోఆశ్రమాన్ని కూల్చే యత్నం
తనపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అప్పటి నుంచి ఆశ్రమంపై, నిర్వాహకులపై కక్ష గట్టారు. తన అధికార బలాన్ని ఉపయోగించి ఆక్రమ కట్టడాల పేరుతో ఆశ్రమంలో నిర్మాణాలను అడ్డుకునేందుకు అధికారులను ఆశ్రమంపై ఉసిగొల్పినట్లు ఆశ్రమ నిర్వాహకులే చెబుతున్నారు. అంతేకాకుండా 2017 సెప్టెంబర్‌లో ఆశ్రమంలోని వ్యర్థాలను (సెప్టిక్‌ ట్యాంక్‌ను) బయటికి తరలిస్తుండగా పెద్దపొలమడ గ్రామస్తులు ట్యాంకర్‌ను అడ్డగించి నిప్పంటించారు. ఈ ఘటన వెనుక ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఉన్నట్లు అప్పట్లో  ఆరోపణలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి ఆశ్రమ నిర్వాహకులు, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. అయితే పోలీసులు ఏకపక్షంగా వ్యహరించడంతో ఆశ్రమ నిర్వాహకులు అధికారపార్టీ ఎమ్మెల్యే జేసీ ఆగడాలపై అప్పట్లో హోంమంత్రికి, డీఐజీకి ఫిర్యాదు చేసినట్లు చేశారు.

ఓటమి భయంతో ఆగడాలు
రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా తమకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న భయంతో జేసీ సోదరులు దాడులకు బరితెగిస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  సమన్వకర్తగా కేతిరెడ్డి పెద్దారెడ్డి బాధ్యతలు స్వీకరించన తర్వాత నియోజకవర్గంలో వైఎస్సార్‌ సీపీ మరింతగా పుంజుకుంది. గ్రామస్థాయిలో ఓటు బ్యాంకును సంపాదించడంలో పెద్దారెడ్డి సఫలీకృతులయ్యారు. దీనికి తోడు జేసీ సోదరుల ఆగడాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి వారి దౌర్జన్యాలను అడ్డుకోవడంతో జేసీ సోదరులు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ క్రమంలో ప్రబోధాశ్రమం భక్తులు పరోక్షంగా వైఎస్సార్‌ సీపీకి మద్దతు తెలుపుతుండాన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి ప్రబోధాశ్రమానికి చెందిన సుమారు 6వేల మంది భక్తుల పేర్లను ఓటరు జాబితాలోకి నమోదు కాకుండా తెరవెనక ప్రయత్నాలు సాగించినట్లు సమాచారం. మరోవైపు తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్న అక్కసుతో ఎలాగైనా ఆశ్రమ నిర్వాహకులను లొంగదీసుకుని తన గుప్పిట్లో ఉంచుకోవాలని పలుమార్లు వారితో రాజీ ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ప్రబోధానంద స్వామివర్సెస్‌ ఎమ్మెల్యే జేసీ
స్వామి ప్రబోధానందస్వామి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి.  ఇటీవల కమ్మసేవా సంఘం ఆధ్వర్యంలో తాడిపత్రి మండలంలోని రావివెంకటాంపల్లి సమీపంలో కాకతీయ కమ్మసేవా సంఘం కల్యాణ మండపం నిర్మాణాని ప్రభోదానంద స్వామి ఆర్థిక సాయం చేశారు. భవన నిర్మాణ శంకుస్థానకు మాజీ డీజీపీ రాముడు సహా కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు, అధికారులతో పాటు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి కూడా హాజరయ్యారు. ఇదంతా స్వామి ప్రబోధానంద స్వామినే చేయిస్తున్నారని భావించిన జేసీ సోదరులు..దాన్ని జీర్ణించుకోలేకపోయారు. తనకు వ్యతిరేకంగా కమ్మసామాజిక వర్గాన్నంతటినీ ప్రభోదానందస్వామి కూడగట్టి తాడిపత్రిలో బలమైన వర్గంగా ఎదుగుతున్నాడని భావించిన ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి... అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరిపై బాహాటంగానే విమర్శలు గుప్పించారు.  రానున్న ఎన్నికల్లో తాను గెలవాలంటే ప్రబోధాశ్రమాన్ని ఎలాగైనా మూసివేయించాలన్న దురుద్దేశ్యంతో దాడులకు దెగబడుతున్నట్లు సమాచారం.  

హిందువుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం
తనకు వ్యతిరేకత ఉన్న ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణ సృష్టించి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నదే అధికారపార్టీ నేతల ప్లాన్‌గా తెలుస్తోంది. అందులో భాగంగానే జేసీ సోదరులు ప్రభోదానందాశ్రమం భక్తులకు, పెద్దపొలమడ గ్రామస్తుల మధ్య చిచ్చుపెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల వరకు పెద్దపొలమడ, చిన్నపొలమడ గ్రామ ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి ఉండే వారు.. కానీ అధికార పార్టీ నేతల పన్నాంగంతో శత్రుత్వం పెంచుకుని నేడు కత్తులు దూసుకునేందుకు సిద్ధమయ్యారు. జేసీ సోదరుల ప్రోద్భలంతో ఒకరిపై ఒకరు రాళ్లదాడులు, దహనాలకు పాల్పడుతున్నారు. ప్రబోధాశ్రమంపై ఓ వర్గాన్ని జేసీ సోదరులు ఉసిగొల్పుతున్నారనిఆశ్రమానికి చెందిన భక్తులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement