
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శుక్రవారం జరగాల్సిన ఉద్యోగ మేళా రద్దు అయిందన్న సమాచారం తెలియక వచ్చిన వేలాది మంది నిరుద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కారణంగా మేళా రద్దు చేయడమేంటని ఐదు జిల్లాల నుంచి వచ్చిన యువతీయువకులు మండిపడ్డారు. ఎంతో వ్యయప్రయాసలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తమను తీవ్ర నిరాశకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. 30 కంపెనీలకు సంబంధించి 2500 ఉద్యోగాల కల్పన కోసం కౌశల్ గోదావరి– వికాస్ సంస్థ ప్రతినిధుల సహకారంతో నన్నయ యూనివర్సిటీలో ఉద్యోగ మేళా నిర్వహించేందుకు నిర్ణయించారు.
ఉత్తరాంధ్ర, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు చెందిన 10 వేల మంది నిరుద్యోగులకు సమాచారం పంపించారు. దీంతో వారంతా గురువారం సాయంత్రమే యూనివర్సిటీకి వచ్చేందుకు బయలుదేరారు. అయితే, ఈలోపే ఉద్యోగ మేళా ఆహ్వాన పత్రిక, బ్రోచర్, ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తన ఫొటో వేయకపోవడమేంటని, తనకు తెలియకుండా నిర్వహించడమేంటని నిర్వాహకులపై ఎమ్మెల్యే పెందుర్తి సీరియస్ అయినట్టు తెలిసింది. దీంతో ఉద్యోగ మేళాను రద్దు చేశారు. అయితే, ఈ విషయం తెలియని వారంతా శుక్రవారం నన్నయ యూనివర్సిటీకి వచ్చారు. మేళా రద్దు అయిందని కాకినాడలో జరుగుతుందని పెట్టిన బోర్డును చూసి షాక్ అయ్యారు. దీంతో కాకినాడ వెళ్లారు. అయితే, అక్కడ కేవలం ఆరు కంపెనీలకు చెందిన ఉద్యోగాలకే ఎంపిక చేస్తుండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment