కొబ్బరికాయ సిద్ధాంతమేంటి బాబూ?: జూపూడి
హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబులాగా తెర ముందు ఒకలా, తెర చాటున మరోలా నటించడం తమ పార్టీకి చేతకాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. చంద్రబాబుకు విధానమంటూ ఒకటుందా? అని ఆయన ప్రశ్నించారు.
‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ 2008లో కేంద్రానికి లేఖ ఇచ్చారు. ప్రధానికి రాసిన లేఖలో సమన్యాయం అన్నారు. తాజాగా రాష్ట్రపతికి రాసిన లేఖలో కొబ్బరికాయ సిద్ధాంతాన్ని ప్రస్తావించారు. అసలు చంద్రబాబుకు మైండు పనిచేస్తుందా అన్నది అర్థం కావడం లేదు’ అని వ్యాఖ్యానించారు. రూ. 5 లక్షల కోట్లే కొబ్బరికాయ సిద్ధాంతంలో ఉన్నట్లుందని జూపూడి ఎద్దేవా చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు శాసనసభను సమావేశపర్చాలని గవర్నర్‌ను తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ రెండు సార్లు కోరారని.. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం తనకు పట్టనట్లు ఉన్నారని విమర్శించారు. ఇప్పటికైనా సమైక్యం వైపు రాకపోతే చరిత్రహీనుడిగా మిగిలిపోతావని హెచ్చరించారు. కొబ్బరికాయ పగులగొట్టినంత సులువుగా రాష్ట్రాన్ని విడగొట్టాలని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో జూపూడి ఈ విధంగా స్పందించారు.