ముద్రగడ దీక్ష నేపథ్యంలో నిఘా
జిల్లా వ్యాప్తంగా షాడో పార్టీలు
చిత్తూరు (అర్బన్): జిల్లా వ్యాప్తంగా కాపు (బలిజ) నాయకుల కదలికలపై పోలీసు యం త్రాంగం నిఘా ఉంచింది. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌తో ఆ సామాజికవర్గ రాష్ట్ర నాయకుడు ముద్రగడ పద్మనాభం రెండు రోజులుగా ఆయన భార్యతో కలిసి ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ చేపట్టిన దీక్షను అణచివేయాలని ఎక్కడా ఆందోళనలు జరగకుండా ఉండటానికి పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు అందాయి. జిల్లాలో దాదాపు 3.75 లక్షల కాపు జనాభా ఉంది. కాపు నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నప్పటికీ ముద్రగడ దంపతుల ఆమరణ దీక్షతో ప్రభుత్వానికి ఎక్కడ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటుందోననే భయం పట్టుకుంది. ఈ ఏడాది జనవరి 31న తునిలో జరిగిన బీసీ గర్జనలో రైలును తగులబెట్టడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయింది. ముద్రగడకు మద్దతుగా ఎక్కడైనా కాపు నాయకులు ఆందోళనకు దిగితే హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటాయోనని పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ప్రధానంగా చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఉన్న కాపు ప్రధాన నాయకుల కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్‌తో పాటు శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీసులు సైతం వేర్వేరుగా రంగంలోకి దిగారు.
ఏయే వేళల్లో ఎక్కడికి వెళుతున్నారు..? ఎవరితో మాట్లాడుతున్నారు..? ఏదైనా ఆందోళనకు సిద్ధమవుతున్నారా..? అనే కోణాల్లో ఆరా తీస్తున్నారు. కొందరు ప్రధాన కాపు నాయకులకు పోలీసు ఉన్నతాధికారులే ఫోన్లు చేసి ఉన్నపలంగా కుశలం అడుగుతుండటంతో నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు పోలీసులు ఓ అడుగు ముందుకేసి ముద్రగడకు మద్దతుగా ఏదైనా ఆందోళన కార్యక్రమాలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేస్తే కేసులు పెట్టి జైలులో వేస్తామని బెదిరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇక తునిలో జరిగిన బీసీ గర్జనకు వెళ్లిన నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కాపు నేతలను సైతం షాడో పార్టీ వెంటాడుతోంది. ఇంట్లోంచి బంధువుల ఇళ్లకు వెళ్లాలన్నా.. వ్యక్తిగత పనులు చక్కబెట్టుకోవడానికి పోలీసుల నిఘా ఇబ్బంది కరంగా మారుతోందని పలువురు నేతలు వాపోతున్నారు.