కేంద్రం చర్యపై సుప్రీం కోర్టుకెళ్తాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలపడంపై టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర నిరసన తెలిపారు. కేంద్రం చర్య దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇది తెలంగాణ వ్యతిరేక చర్య అని మండిపడ్డారు. టీ-బిల్లుకు రాష్ట్రపతి రాజముద్ర వేసిన సిరా తడి ఆరకముందే మరోమారు తెలంగాణకు అన్యాయం జరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంపై టీఆర్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందని, న్యాయం జరిగేవరకు పోరాడుతుందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రలో కలపడమే అన్యాయమని తాము ఇంతకుముందే చెప్పామన్నారు. ఇప్పుడు ఏకంగా 7 మండలాల్ని ఆంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ జారీ చేయడం అన్యాయానికి పరాకాష్ట అన్నారు. కేంద్రం ఈ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందనే తాను ఢిల్లీలోనే కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి ఆ మండలాలను ఆంధ్రలో కలపొద్దని కోరానని చెప్పారు. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతల్ని హెచ్చరించినా వారు పట్టించుకోలేదన్నారు.