కేరళ అమృతా ఆస్పత్రిలో చేతి ఆపరేషన్ చేయించుకున్న ప్రసాద్‌ను పరామర్శిస్తున్న ఐఎన్‌టీయూసీ ప్రతినిధులు
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): కేరళ వైద్యులు అద్భుతం చేసి చూపించారు. విద్యుత్ షాక్‌కు గురై రెండు చేతులూ కోల్పోయిన ఇక్కడి ఎన్‌ఏడీ ఉద్యోగికి బ్రైన్ డెడ్ అయిన ఒక వ్యక్తి నుంచి వాటిని సేకరించి అతికించారు. కేరళ రాష్ట్రంలోని అమృతా ఆస్పత్రిలో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తిచేశారు. అయితే ఇన్‌ఫెక్షన్ కారణంగా అతికించిన ఎడమ చేతిని తొలగించాల్సి వచ్చింది. ఈ శస్త్రచికిత్సకు అవసరమైన రూ.20 లక్షలు ప్రభుత్వం ద్వారా వచ్చేలా ఐఎన్‌టీయూసీ విశేష కృషి చేసింది. కేంద్ర రక్షణ శాఖ నిధులు మంజూరు చేయడంతో ఉద్యోగికి కొత్త చేతిని అతికించారు.
విద్యుత్ షాక్‌తో పోయిన చేతులు..
2007లో ఎన్‌ఏడీ ప్రాంతం శాంతినగర్‌కు చెందిన ఎం.డి.ప్రసాద్ నేవల్ ఆర్మమెంట్ డిపో(ఎన్‌ఏడీ)లో ఉద్యోగంలో చేరాడు. చేరిన రెండేళ్లకే ఇంటి వద్ద విద్యుత్ షాక్‌కు గురవడంతో రెండు చేతులూ పోయాయి. కేజీహెచ్‌లో వాటిని తొలగించేశారు. రెండు ఆర్టిషీషియల్ చేతులతో పదేళ్లుగా అతడు ఉద్యోగం చేస్తున్నాడు. కేజీహెచ్‌లో ఓ డాక్టర్ సలహా మేరకు కేరళాలో మనుషుల చేతులను అతికిస్తారని తెలిసి ప్రసాద్ సంప్రదించాడు. దీంతో ఆయన ఆశకు ఒక దారి దొరికినట్లయింది. అయితే రెండు చేతులు అతికించేందుకు సుమారు రూ.20 లక్షలు ఖర్చవుతుందని అక్కడి డాక్టర్లు చెప్పడంతో నిరాశగా వెనుదిరిగాడు. ఈ విషయాన్ని ఐఎన్‌టీయూసీ దృష్టిలో పెట్టాడు. తోటి ఉద్యోగికి సాయపడాలని యూనియన్ సభ్యులు ఎంతో కృషి చేశారు. రక్షణ రంగంలో ఈ విధంగా చేతులు, కాళ్లు కోల్పోయిన వారికి కొత్తగా అవయవాల ఏర్పాటు కోసం ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. అందుకు ఎటువంటి అవకాశం లేకపోయిన యూనియన్ పట్టు వీడలేదు. ఢిల్లీ స్థాయిలో రక్షణ శాఖ మంత్రి దృష్టికి దీనిని తీసుకెళ్లారు. దీంతో ఆపరేషన్‌కు నిధులు మంజూరయ్యాయి.
అమృతా ఆస్పత్రిలో ఆపరేషన్..
చేతుల ఆపరేషన్ కోసం కేరళలోని అమృతా ఆస్పత్రిలో ఎం.డి.ప్రసాద్ చేరాడు. బ్రైన్ డెడ్ అయిన ఒక వ్యక్తి నుంచి వైద్యులు రెండు చేతులు సేకరించారు. ఆపరేషన్ చేసి వాటిని ప్రసాద్‌కు అతికించారు. కుడి చేతి ఆపరేషన్ సక్సస్ అయిందని.. ఎడమ చేతి ఆపరేషన్ తరువాత ఇన్‌ఫెక్షన్ రావడంతో దాన్ని తొలగించేశారని యూనియన్ నాయకులు తెలిపారు. రక్షణ శాఖ ఉద్యోగికి ప్రభుత్వ నిధులతో ఈ విధమైన ఆపరేషన్ చేయడం ఇదే తొలిసారని ఉద్యోగులు చెబుతున్నారు.
ఐఎన్‌టీయూసీ ప్రతినిధుల పరామర్శ..
చేతి ఆపరేషన్ చేయించుకున్నా ఎం.డి.ప్రసాద్‌ను శనివారం ఎన్‌ఏడీ ఐఎన్‌టీయూసీ కార్యదర్శి ఎస్.మారయ్య, ఉద్యోగులు ఎ.గణేష్, కె.వేలుబాబు తదితరులు పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. నీ వెంట యూనియన్ ఎల్లప్పుడూ ఉంటుందని ప్రసాద్‌కు భరోసా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment