ల్యాబ్ అసిస్టెంట్‌పై కేసు నమోదు
ఏలూరు అర్బన్ :వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లిన యువతిపై ల్యాబ్ అసిస్టెంట్ అత్యాచార యత్నానికి ఒడిగట్టిన ఉదంతమిది. రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. వీరవాసరం గ్రామానికి చెందిన 18 ఏళ్ల యువతి నాలుగేళ్లుగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతోంది. తల్లిదండ్రులు ఆమెను భీమవరంలోని ఒక వైద్యునికి చూపించి మందులు వాడుతున్నారు. యువతికి మెరుగైన చికిత్స చేయించాలని వైద్యుడు సూచించడంతో ఆమెను ఈనెల 28న ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో గురువారం యువతికి ఎక్స్‌రే తీయించమని అక్కడి వైద్యులు చెప్పడంతో ఆమె తల్లి అందుకు సొమ్ము చెల్లించేందుకు వెళ్లింది. ఇదే అదునుగా రాజు అనే ల్యాబ్ అసిస్టెంట్ ఆ యువతి వద్దకు వెళ్లి మీ అమ్మ రావడం ఆలస్యమవుతుందని చెప్పాడు. ఈలోగా ఎక్స్‌రే తీస్తానని ల్యాబ్‌లోకి తీసుకెళ్లాడు. తలుపులు వేసి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఇది గమనించిన యువతి అతడిని తోసివేసి తలుపులు తెరుచుకుని బయటకు పరుగులు పెట్టింది. ఇదే సమయంలో అటుగా వస్తున్న తల్లి ఏం జరిగిందని అడగ్గా, ఆ యువతి విషయం చెప్పి బావురుమంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ల్యాబ్ అసిస్టెంట్ రాజుపై అత్యాచార యత్నం కేసు నమోదు చేసినట్టు ఏలూరు రూరల్ పోలీసులు తెలిపారు.
రోగిపై అత్యాచార యత్నం
Published Fri, May 1 2015 5:28 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM
Advertisement