లక్ష్మీదేవిని హత్య చేసింది మరిదే!
చాపాడు: మండల పరిధిలోని విశ్వనాథపురం గ్రామంలో ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం దారుణ హత్యకు గురైన భూమిరెడ్డి లక్ష్మీదేవిని మనస్పర్థల కారణంగానే మరిది అయిన భూమిరెడ్డి ఓబుళరెడ్డి హత్య చేశాడు. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఈ మిస్టరీ వీడింది. ఈ మేరకు ఓబుళరెడ్డి సోమవారం ఉదయం వీఆర్వో సుమలత ముందు లొంగిపోయి తానే లక్ష్మీదేవిని హత్య చేసినట్లు అంగీకరించాడు. వీఆర్వో నిందితుడిని రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డికి అప్పజెప్పారు. హత్యకు పాల్పడిన ఓబుళరెడ్డిని సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేసి డీఎస్సీ శ్రీనివాసులరెడ్డి, రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డిల సమక్షంలో ఎస్‌ఐ గిరిబాబు విలేకరుల ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ విశ్వనాథపురానికి చెందిన భూమిరెడ్డి గురివిరెడ్డికి, సోదరుడు ఓబుళరెడ్డికి పొలాల వద్ద సమస్యలుండేవి. రోజురోజుకు మనస్పర్థలు అధికమయ్యాయి. గురివిరెడ్డి గత కొన్నేళ్లుగా వివాహేతర సంబంధంతో వేరే గ్రామంలో ఉన్నాడు. గురివిరెడ్డి భార్య లక్ష్మీదేవి, ఓబుళరెడ్డి తరుచూ గొడవలు పడుతుండేవారు. ఇదే క్రమంలో ఈ నెల 10వ తేదీన పొలం దగ్గర, ఇంటి వద్ద కూడా గొడవ పడ్డారు. మధ్యాహ్నం 1.30గంట సమయంలో లక్ష్మీదేవి తన ఇంటి వద్ద వరండాలో మంచంపై నిద్రిస్తుండగా, ఎవ్వరూ లేరని భావించిన ఓబుళరెడ్డి ఇంటిలోని రోకలిబండతో తలపై, ముఖంపై నాలుగైదుసార్లు బలంగా కొట్టాడు. దీంతో లక్ష్మీదేవి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ కేసును దర్యాప్తు చేస్తుండగా, సోమవారం నిందితుడే తానే హత్య చేశానని ఒప్పుకుని లొంగిపోయాడని డీఎస్పీ వివరించారు.