
ఇష్టారాజ్యంగా ఫీజుల వసూలు
విద్యా శాఖాధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రయివేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజుల్ని వసూలు చేస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 700 ప్రయివేటు పాఠశాలలున్నాయి.
- నిబంధనల్ని పట్టించుకోని ప్రయివేటు పాఠశాలలు
- విద్యాశాఖాధికారుల హెచ్చరికలు బేఖాతరు
నర్సీపట్నం : విద్యా శాఖాధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రయివేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజుల్ని వసూలు చేస్తున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 700 ప్రయివేటు పాఠశాలలున్నాయి. వీటిలో ఎల్‌కేజీకి రూ.10 వేలు, యూకేజీకి రూ.12 వేలు, ఒకటి నుంచి అయిదు తరగతుల వరకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు, ఆరు నుంచి పది వరకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నాయి.
వసతుల ప్రకారమే వసూలు చేయాలి
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక ప్రయివేటు పాఠశాలలో వసతులకు అనుగుణంగా ఫీజులు నిర్ణయించాలి. పాఠశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన కమిటీ దీన్ని నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ప్రయివేటు పాఠశాలలేవీ ఈ నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేయడంపై నిరసనలు వ్యక్తం కావడంతో ప్రభుత్వం ప్రయివేటు పాఠశాలలను గ్రేడ్లుగా విభజించాలని నిర్ణయించింది.
దీన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లో కొన్ని పాఠశాలల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యవహారం ఇంకా తేలకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజుల్ని వసూలు చేస్తున్నాయి. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి కృష్ణారెడ్డిని వివరణ కోరగా పాఠశాలల్లో వసతులను బట్టి ఫీజులను నిర్ణయించాల్సి ఉందన్నారు. అలా చేయని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.