వరంగల్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ నేతలు వలస బాట పడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ర్ట్ర ప్రకటన నేపథ్యంలో ముందస్తు బెర్తుల కోసం నేతలు అధికార పార్టీకి జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు వలస బాటలో ఉన్నారు. మాజీ మంత్రులు గుండె విజయరామారావు, చందూలాల్ సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరే అంశంపై మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన, కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్ విలీన ప్రచారంతో గులాబీలు తమ రాజకీయ భవితవ్యం కోసం ముందుగానే ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ముందస్తుగా కాంగ్రెస్‌లో చేరితే కొంత మేరకైనా ప్రాముఖ్యత ఉంటుందన్న ఆశతో బేరసారాలు సాగిస్తున్నారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న మాజీ మంత్రి విజయరామారావు కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
2004లో స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2007లో మంత్రి పదవి చేపట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2008లో రాజీ నామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో సైతం ఓటమి పాలయ్యారు. ఈ తర్వాత పార్టీ వ్యవహారాల్లో పాల్గొన్నా.. కొంతకాలంగా స్తబ్ధుగా ఉంటున్నారు. ఇక, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన చందూలాల్ 2004 లో టీఆర్‌ఎస్‌లో చేరారు. అంతకుముందు ఆయన టీడీపీలో కీలక పదవుల్లో ఉన్నారు. 1986లో ఎమ్మెల్యేగా ములుగు నుంచి ఎన్నికయ్యారు. 1989-90లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 1996-1998 వరకు వరంగల్ ఎంపీగా ఉన్నారు. 2004లో ములుగు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ సీటును సీతక్కకు కేటాయించారు. 2004 ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. 2009 ఎన్నికల్లో మహబూబాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చాలా కాలం నుంచే చందూలాల్ టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరేం దుకు సిద్ధమయ్యారు. జిల్లాకు చెందిన ఈ కీలక నేతలు గులాబీ పార్టీని వీడనున్నారు.
గులాబీకి గుడ్‌బై ?
Published Tue, Aug 6 2013 5:47 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement