సార్.. తెలంగాణ దిక్సూచి | proff. jaya shankar is kcr 's god father | Sakshi
Sakshi News home page

సార్.. తెలంగాణ దిక్సూచి

Published Wed, Aug 7 2013 5:25 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

proff. jaya shankar is kcr 's god father

హన్మకొండచౌరస్తా/వడ్డెపల్లి, న్యూస్‌లైన్: ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ తన నిరాడంబరమైన జీవితంలో కేసీఆర్‌కే కాదు... తెలంగాణ సమాజానికే పెద్ద దిక్కుగా నిలిచారని సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు కొనియూడారు. కేసీఆర్ సుఖాల్లోనే కాదు... కష్టాల్లోనూ తానున్నానంటూ వెన్నుదన్నుగా నిలిచి ఓ గురువు, తండ్రి పాత్ర పోషించి అండదండగా నిలిచిన గొప్ప వ్యక్తి అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ 79వ జయంతిని మంగళవారం బాలసముద్రంలోని ఏకశిలా పార్కు (జయశంకర్ స్మృతివనం)లో ఘనంగా నిర్వహించారు.
 
  ముందుగా నగర శివారు మడికొండ నుంచి కేటీఆర్, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణవాదులు ర్యాలీగా బాలసముద్రంలోని పార్కుకు చేరుకున్నారు. అనంతరం జేఏసీ  జిల్లా అధ్యక్షుడు, ప్రొఫెసర్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ పదకొండు రోజుల ఆమరణ దీక్ష చేసిన సందర్భంలో కేంద్ర మంత్రి చిదంబరం స్వయంగా జయశంకర్ సార్‌కు ఫోన్ చేసి మాట్లాడారనిచెప్పారు. ఆ తర్వాతనే డిసెంబర్ 9న తెలంగాణపై అధికార ప్రకటన చేశారని... ఈ ఘనత ప్రొఫెసర్‌కే దక్కుతుందన్నారు. జయశంకర్ సార్ ఎంతో వాక్‌చాతుర్యం గల వారని, హాస్యప్రియుడని పేర్కొన్నారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో మాట్లాడుతున్నానంటే అందుకు ప్రొఫెసర్ అందించిన స్ఫూర్తే కారణమన్నారు. కేసీఆర్ మొండితనానికి జయశంకర్ సార్ సారథ్యం తోడైనందునే తెలంగాణ ఉద్యమం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడగలిగిందన్నా రు. కేసీఆర్ సూటిగా విమర్శిస్తే సీమాంధ్రుల గుండెల్లో గునపం గుచ్చినట్లు ఉంటుందని... కానీ జయశంకర్ సార్ విమర్శలు కాశ్మీర్ శాలువాలో చెప్పు పెట్టి కొట్టినట్లుగా ఉండేవని మేధావులే కితాబిచ్చారని గుర్తు చేశారు. ప్రొఫెసర్ మరణాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారని... ఆయన లేడన్న విషయాన్ని పదేపదే గుర్తుచేసుకుని కంటతడి పెట్టేవారని చెప్పారు.
 
 రాజముద్ర పడ్డాకే విజయోత్సవాలు
 కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ నమ్మొద్దని, పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఆమోదించిన అనంతరం రాజముద్ర పడ్డాకే... విజయోత్సవ సంబరాలు జరుపుకుందామని కేటీఆర్ అన్నారు. అప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ లో ఆంధ్ర నాయకుల విగ్రహాలే కాదు.... తెలంగాణ ఉద్యమ కారులు కాళోజీ, జయశంకర్ సార్ విగ్రహాలను ట్యాంక్‌బండ్ పై ఏర్పా టు చేసుకుందామన్నారు. రాష్ట్ర ఏర్పాటు తదనంతరం తెలంగాణ పది జిల్లాలో పునర్నిర్మా ణం చేపట్టి వరంగల్‌లో ఏర్పడే కొత్త జిల్లాకు జయశంకర్ సార్ పేరు పెడదామన్నారు. తె లంగాణ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం జయశంకర్ స్మారక గురుకులాలు, స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్ అందిస్తామన్నారు.  తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ప్రజలు మరిచిపోలేని పాత్ర పోషించారన్నారు. పాలకుర్తిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ములుగు రాయినిగూడెంలో సీఎం కిరణ్‌కుమార్, పీఆర్పీలో ఉన్నప్పుడు చిరంజీవికి ఓరుగల్లు ప్రజలు తమ పోరాటపటిమను చూపించారన్నారు.
 
 సీమాంధ్ర నేతల కుట్రలను తిప్పికొట్టాలి
 కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్న సీమాంధ్ర టీడీపీ, కాంగ్రెస్ నాయకుల కుట్రలను తిప్పికొట్టేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. సీమాంధ్ర రాజ కీయ నాయకుల స్వార్థం కోసం అక్కడి ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం  ఇప్పటికే వేల మందిని పోగొట్టుకున్నామని, ప్రాణాలు విడవొద్దని సీమాంధ్రప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై సీమాంధ్ర నాయకుల్లో అపోహలు తొలగించేందుకు చర్చకు సిద్ధమన్నారు. తెలంగాణ ఊపిరి, ఆశయ సాధన కోసం జయశంకర్ సార్ ఓ శిల్పిలా పాటుపడ్డారని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య  అన్నారు. జయశంకర్ శిల్పి అయితే కేసీఆర్ మంచి విగ్రహానికి ఉపయోగించే గట్టి రాయిలాంటి వారన్నారు. కేసీఆర్‌ను తెలంగాణకు సింహస్వప్నంగా మలి చిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. ఏకశిలా పార్కును జయశంకర్ సృ్మతి వనంగా మార్చి, జిల్లా కళాకారుల కోసం పార్కు ఆవరణలో ఆడిటోరియం నిర్మాణానికి నిధులు కావాలని సీఎంను కోరితే... లేవని చెప్పారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్  వెల్లడించారు. వచ్చే జయంతి లోపు తెలంగాణకే తలమానికంగా ఏకశిలా పార్కును రూపుదిద్దుతాన్నారు.
 
  టీడీపీ సీమాంద్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే చంద్రబాబు స్పందించకపోవడం ఆయన రెండు నాలుకల ధోరణికి నిదర్శనమని విమర్శించారు. ఊసరవెల్లి ఎర్రబెల్లికి చీమునెత్తురు ఉంటే సీఎం పదవిపై కలలు కనడం కాదు... హరికృష్ణ రాజీనామా వెనక్కి తీసుకునేలా బాబుపై ఒత్తిడి తేవాలని సవాల్ విసిరారు. హన్మకొండ చౌరస్తాలో జయశంకర్‌సార్ నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి కొనియూడారు. టీఆర్‌ఎస్ నాయకులు పరమేశ్వర్, రాజయ్యయాదవ్, అచ్చ విద్యాసాగర్, బూజుగుండ్ల రాజేంద్రకుమార్, కొక్కుల సతీష్, గుడిమళ్ల రవికుమార్, వాసుదేవరెడ్డి, జోరిక రమేష్, దర్శన్‌సింగ్ పాల్గొన్నారు.
 పెద్ద సార్‌కు ఓరుగల్లు నివాళి
 జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు
 వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్‌కు ఓరుగల్లు ఘననివాళులర్పించింది. ప్రొఫెసర్ జయంతిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా మంగళవారం టీఆర్‌ఎస్, టీజేఏసీ, ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉద్యోగ, వైద్య, న్యాయవాద, యువజన, స్వచ్ఛంద సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగారుు. జనగా మ, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండ, వరంగల్, భూపాలపల్లి, పరకాల, ములుగు, నర్సం పేట, మహబూబాద్, డోర్నకల్, వర్ధన్నపేట, తొర్రూరు ప్రాంతాల్లో రక్తదానం, అన్నదానం, పండ్లు, నోట్‌బుక్‌ల పంపిణీ చేపట్టారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.
 
  హన్మకొండ అమరవీరుల స్థూ పం వద్ద అధిక సంఖ్యలో తెలంగాణవాదులు నివాళులర్పించారు. భీమారంలో జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. గొర్రెకుంట, కొత్తవాడ, ఎంజీఎంలో జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్‌ఎస్ జిల్లా, అర్బన్ కార్యాలయాల్లో రక్తదానం చేశారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పార్టీ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి, కన్నెబోయిన రాజయ్యయాదవ్, గుడిమల్ల, డాక్టర్ పరమేశ్వర్,  వాసుదేవరెడ్డి, జోరిక రమేష్, చాగంటి రమేష్, బూజుగుండ్ల పాల్గొన్నారు.   


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement