
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి: సమైక్యాంధ్ర జేఏసీ
సాక్షి, గుంటూరు: ‘ఇక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి.. లేదంటే రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనండి’ అని సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సమైక్యాంధ్ర జేఏసీ సూచించింది. ఉద్యమ కార్యాచరణపై విశ్వవిద్యాలయాలు, జిల్లాస్థాయి సమైక్యాంధ్ర జేఏసీల సమావేశం మంగళవారం ఇక్కడి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగింది. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఆచార్య ఎన్.శామ్యూల్ అధ్యక్షత వహించిన సమావేశంలో గౌరవాధ్యక్షుడు ఆచార్య పి.నరసింహారావు మాట్లాడుతూ, ఎంపీలు ఆహార భద్రత బిల్లు ఓటింగ్‌ను బహిష్కరిస్తే కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఉద్యమం లో పాల్గొనాలని, ఈనెల 12వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించారు. రాజీనామా డ్రామాలు ఆపి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్ మాట్లాడుతూ,సమైక్యాంధ్ర ఉద్యమం తన పేటెంట్ హక్కుగా చెప్పుకున్న కావూరి సాంబశివరావు. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కేంద్రమంత్రి పదవి పొందడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి వారిని చిత్తుగా ఓడించి బుద్ధి చెబుతామన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు అప్పిరెడ్డి మాట్లాడుతూ, సమైక్యాంధ్రకు విఘాతం కలిగించే ఏ నాయకుడినైనా నిలదీయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఏపీ ఎన్జీవోస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు టీవీ రామిరెడ్డి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జి.వి. ఎస్.ఆర్.ఆంజనేయులు, నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ గుంటూరు జిల్లా కన్వీనర్ సదాశివరావు, గుంటూరు జిల్లా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఆంజనేయులు ప్రసంగించారు. అనంతరం సమావేశం తీర్మానాలను సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆడారి కిషోర్, భవిష్యత్ కార్యాచరణను విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ డాక్టర్ ఎం. వెంకటరమణ వెల్లడించారు.
సమావేశం తీర్మానాలు
సీమాంధ్ర ప్రజాప్రతినిధులు
ఈనెల 12లోగా రాజీనామాలు చేయాలి
సమైక్య రాష్ట్రాన్ని కొనసాగిస్తున్నామని కేంద్రం
{పకటించేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలి
పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు
ఉద్యమంలో భాగస్వాములు కావాలి
ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి
ఆత్మహత్యలు చేసుకోకుండా ఆత్మస్థయిర్యంతో పోరాడాలి
భవిష్యత్ కార్యాచరణ
ఈ నెల 7,8 తేదీల్లో కేంధ్ర ప్రభుత్వ సంస్థలు,
కార్యాలయాల్లో బంద్ పాటించాలి
9, 10 తేదీల్లో సీమాంధ్ర ప్రాంతంలో రైల్‌బంద్
11, 12 తేదీల్లో విశ్వవిద్యాలయాలు,
అన్నిప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించాలి