కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: రాష్ర్ట విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆపకుండా ముందుకు వెళ్దాం అని భీష్మించారు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు. ఈ మేరకు నిరవధిక సమ్మె చేపట్టిన ఉద్యోగ సంఘాల నేతలు బుధవారం భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ వీసీహెచ్ వెంగల్ రెడ్డి, కన్వీనర్ క్రిష్టఫర్ దేవకుమార్, కో-చైర్మన్ సంపత్‌కుమార్, కోశాధికారి శ్రీరాములు నేతృత్వంలో కలెక్టరేట్ ఎదుట ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూ, ట్రెజరీ, పశుసంవర్ధక శాఖ, సహకార శాఖ, వ్యవసాయ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ తదితర శాఖల ఉద్యోగులు భారీ ఎత్తున పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయ సంఘాల జేఏసీ భారీ ర్యాలీ నిర్వహించింది.
వివిధ ఉద్యోగ సంఘాలు ర్యాలీ, ధర్నాలు నిర్వహించి రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వివిధ ఉద్యోగ సంఘాల నేతలను ఉద్దేశించి జిల్లా రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక కో-చైర్మన్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు సోనియా చేతిలో కీలుబొమ్మలుగా మారారన్నారు. వారి చేతగానితనంతోనే రాష్ట్రం రెండు ముక్కలయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. రాష్ట్రం రెండు ముక్కలు కాకుండా ఇప్పటికైనా సీమాంధ్రకు చెందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పదవులను త్యాగం చేసి ప్రజా ఉద్యమంలో కలసిరావాలని పిలుపునిచ్చారు. లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే కేసీఆర్, తెలంగాణ ఉద్యోగ సంఘాలు సీమాంధ్ర ఉద్యోగులను హైదరాబాద్ విడిచి వెళ్లాలని బెదిరిస్తున్నారని, రాష్ట్రం విడిపోతే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. చైర్మన్ వీసీహెచ్.వెంగల్‌రెడ్డి మాట్లాడుతూ ఒక్కరోజు, రెండు రోజుల సమ్మెతో లక్ష్యాన్ని సాధించలేమని, కేంద్రం దిగివచ్చేంతవరకు పాలనను స్తంభింపజేయాలన్నారు. ప్రతి ఒక్కరూ మరింత ఉత్సాహంతో సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిరసనలో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సర్దార్ అబ్దుల్ హమీద్, నాగేశ్వరరావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నేత ఉస్మాన్, జేఏసీ నేతలు లక్ష్మన్న, జయరామకృష్ణారెడ్డి, పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జవహర్‌లాల్, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.
పదండి ముందుకు.. ప్రభుత్వం దిగొచ్చే వరకు
Published Thu, Aug 15 2013 3:14 AM | Last Updated on Fri, Sep 1 2017 9:50 PM
Advertisement
Advertisement