పార్వతీపురం: దేశ, రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక పాలన కీలకం. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిధులు చక్కగా సది్వనియోగం అయితే... ప్రత్యామ్నాయంగా రాష్ట్రం, దేశం అభివృద్ధిచెందుతుంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి స్థానిక ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. గ్రామ స్వరాజ్యమే దేశ అభివృద్ధి సూచిక అన్న నినాదం అందరికీ తెలిసిందే. గ్రామ స్వరాజ్యం వర్థిల్లాలంటే స్థానిక సంస్థలు బలోపేతం కావల్సిందేనని అందరూ అంగీకరించాల్సిన విషయం. స్థానిక సంస్థల ఏర్పాటుతోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికసంఘం నిధులు విడుదలై గ్రామాల అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
ఇటీవల 14వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ. 5వేల కోట్లవరకు వెనక్కి పోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి గత 18నెలలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడమే కారణం. నిధులు సద్వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రీకారం చుట్టింది. అయితే, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా బరిలో నిలిచేవారిలో కొందరికి విధులు, అధికారాలపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం సహజమే. ఓటర్లు కూడా తాము ఎన్నుకున్న నాయకుడు నెరవేర్చాల్సిన బాధ్యత, ప్రాధాన్యాలు తెలుసుకోవాలి. ఎంపీటీసీలు ఏంచేయాలి... విధులు, అధికారాలు.. జెడ్పీటీసీలు పరిస్థితి తదితర అంశాలను తెలుసుకుందాం.
జెడ్పీటీసీల ఆవశ్యకత ఇలా...
జిల్లా పరిషత్ నిర్వహణలో జెడ్పీటీసీ సభ్యుల పాత్ర కీలకం. జిల్లా స్థాయిలో పంచాయతీరాజ్ చట్టం పక్కాగా అమలై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సమకూరి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే జిల్లా పరిషత్ వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిందే. జిల్లా పరిషత్ నిర్వహణలో జెడ్పీటీసీ సభ్యుల పాత్ర కీలకం. ఏ తీర్మాణాలు ఆమోదించాలన్నా మెజార్టీ సభ్యులు తప్పనిసరి. ఆమోదించే కార్యక్రమాలు సక్రమంగా నిర్వíర్తించే బాధ్యత సభ్యులపై ఉంటుంది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వీరు ముందుకెళ్లాలి. మండల పరిధిలో జిల్లా ప్రాదేశిక సభ్యులను ఆయా మండల ప్రజలు నేరుగా ఓటుహక్కుతో ఎన్నుకుంటారు. జిల్లా స్థాయిలోని ఎన్నికకాబడిన జెడ్పీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎంపిక చేస్తారు.
జెడ్పీటీసీలు మండలంలోని ప్రజల్ని సమన్వయపరచి అభివృద్ధి, పాలనలో భాగస్వామ్యులవుతారు. జిల్లాపరిషత్ నిర్వహణలో లోపాలు, అలసత్వం, నిధుల దుర్వినియోగంపై జెడ్పీ చైర్మన్, సీఈఓల దృష్టికి తీసుకెళ్లవచ్చు. 15 రోజులు ముందుగా నోటీసులు ఇచ్చి జెడ్పీ పరిపాలనపై సమావేశాల్లో ప్రశ్నించే అవకాశం ఉంటుంది. సీఈఓ ప్రతీ మూడు నెలలకు ఒకమారు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఆర్థిక నివేదికపై చర్చిస్తారు. అన్ని ప్రభుత్వ, జెడ్పీ అధికారిక ఉత్సవాలకు, కార్యక్రమాలకు జెడ్పీటీసీలను తప్పనిసరిగా అహ్వానించాలి. నియోజకవర్గ ఆర్థిక సలహా కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు. జెడ్పీ పాఠశాలల స్థితిగతుల మెరుగుకు సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు అందించవచ్చు. నియోజకవర్గ నీటి వినియోగ పరిరక్షణ కమిటీలో సభ్యులుగా కొనసాగుతారు. జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరగనుంది.
ఎంపీటీసీల అధికారాలు.. విధులు
ఎంపీటీసీలు మండల పరిషత్‌లో ఓటు హక్కును వినియోగించుకుని మండలాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎంపీటీసీలకు సంబంధిత ప్రాదేశిక సెగ్మెంట్ పరిధిలోని ఓటర్లు తమ ఓటు ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపీపీ పదవి పరోక్ష ఎన్నిక ద్వారా ఎంపీటీసీలు అధ్యక్షుడ్ని, ఉపాధ్యాక్షుడిని ఎన్నుకునే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది. దీంతో మండలాభివృద్ధిలో ఎంపీటీసీలే కీలకం అవుతారు. కొత్తగా ఎంపికైన ఎంపీటీసీలు తొలిమూడు సమావేశాలలోపు ప్రమాణ స్వీకారం చేయాలి. లేనిపక్షంలో వారి సభ్యత్వం రద్దు అవుతుంది. దీంతో పాటు వరుస మూడు సమావేశాలకు గైర్హాజరైన సభ్యత్వం పోతుంది. ఆయా పరిధి గ్రామ పంచాయతీలలో ఎంపీటీసీ శాశ్వత అహ్వానితుడవుతారు. పాలకవర్గంలో మాత్రం ఓటు వేసే హక్కు ఉండదు. పంచాయతీ అభివృద్ధిపై సూచనలు, సలహాల మేరకు పరిమితమవుతాడే తప్ప నిర్ణయాధికారం మాత్రం ఉండదు. వారి పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, పాఠశాలల విద్యాప్రమాణాల మెరుగుకు ప్రభుత్వం నుంచి విడుదలైన నిధుల దురి్వనియోగం అయితే ప్రశ్నించే అధికారం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment