నేటి నుంచి.. లాక్‌డౌన్‌ సడలింపులు | Lockdown Relaxation From 4th May In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నేటి నుంచి.. లాక్‌డౌన్‌ సడలింపులు

Published Mon, May 4 2020 3:21 AM | Last Updated on Mon, May 4 2020 8:57 AM

Lockdown Relaxation From 4th May In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా నియంత్రణకు విధించిన లాక్‌డౌన్‌ను కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల ప్రాతిపదికగా సోమవారం నుంచి కొన్ని రకాల సడలింపులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించింది. కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో కరోనా నివారణ చర్యలను మరింత పటిష్టం చేయాలని కూడా ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా, ఇప్పటివరకు ప్రభుత్వం 246 క్లస్టర్లను గుర్తించింది. 

 కంటైన్‌మెంట్‌ క్లస్టర్లంటే..
► కరోనా పాజిటివ్‌ కేసులు, వారి కాంటాక్టులు నివసిస్తున్న చోటును కంటైన్‌మెంట్‌ కేంద్రంగా భావించాలి. అక్కడకు 500 మీటర్ల నుంచి ఒక కిలోమీటర్‌ పరిధిని కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా గుర్తించాలి.
► కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిని బఫర్‌ జోన్‌గా గుర్తించాలి.
► పట్టణ ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల తీవ్రత ఆధారంగా కాలనీ, మున్సిపల్‌ వార్డును కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా గుర్తించాలి. 
► గ్రామీణ ప్రాంతాల్లో కేసుల తీవ్రత ఆధారంగా ఒక గ్రామాన్ని లేదా గ్రామ పంచాయతీ లేదా కొన్ని  గ్రామాల సముదాయాన్ని కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా గుర్తించాలి.

కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లో ఏం చేయాలంటే..
► కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌గా గుర్తించిన ప్రాంతం చుట్టూ బారికేడ్లు పెట్టాలి. ఒక ప్రవేశ ద్వారం, బయటకు వెళ్లేందుకు మరొక మార్గం ఏర్పాటుచేయాలి.
► ప్రజల రాకపోకలను పూర్తిగా నిషేధించాలి.
► ఆహార పదార్థాలు సరఫరా చేసే వారిని, వైద్య సిబ్బందిని మాత్రమే అనుమతించాలి.
► నిత్యావసర సరుకులను ఇళ్ల వద్దకే సరఫరా చేయాలి. తనిఖీ చేయకుండా ఏ ఒక్కరినీ, వాహనాన్ని అనుమతించకూడదు.
► క్లస్టర్‌ నుంచి బయటకు, లోపలకు జరిగే రాకపోకలకు సంబంధించిన రికార్డును నిర్వహించాలి. వైద్య బృందాలతో ఇంటింటి సర్వే నిర్వహించాలి.
► కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తితో కాంటాక్టు అయిన వాళ్లను 12 నుంచి 24 గంటల్లోపు గుర్తించి ఎంఎస్‌ఎస్‌ పోర్టల్‌లో నమోదు చేయాలి.
► వైద్య అధికారుల సూచనల మేరకు వారిని హోం లేదా ఆసుపత్రి క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించాలి.
► ఇలాంటి వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలి. 
► పాజిటివ్‌ తేలిన వ్యక్తులకు వైరస్‌ తీవ్రత ఆధారంగా చికిత్సపై వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలి.
► వారి పేర్లను ఆరోగ్యసేతు యాప్‌లో నమోదు చేయాలి, యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాలి. కరోనా నివారణ చర్యలు సూచించాలి. 

కంటైన్‌మెంట్‌ క్లస్టర్ల వర్గీకరణ ఇలా..
► ఒక పాజిటివ్‌ కేసు నమోదైనప్పటి నుంచి ఐదు రోజుల్లో మరో పాజిటివ్‌ కేసు నమోదైతే వెరీ యాక్టివ్‌ క్లస్టర్లుగా గుర్తించాలి.
► ఆరు నుంచి 14 రోజుల్లోపు కేసులు నమోదైతే యాక్టివ్‌ యాక్టివ్‌ క్లస్టర్లుగా గుర్తించాలి.
► 15–28 రోజుల మధ్య కేసులు నమోదైతే డార్మంట్‌ క్లస్టర్లగా గుర్తించాలి.
► 28వ రోజు తరువాత ఎలాంటి కేసులు నమోదు కాకపోతే కంటైన్‌మెంట్‌ కార్యకలాపాలను క్రమేణా తగ్గించాలి.

కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో పర్యవేక్షణ ఇలా..
► యాక్టివ్‌ కేసులు తగ్గుతున్నాయంటే కోలుకుంటున్న, డిశ్చార్జ్‌ అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు భావించాలి.
► కేసులు–కాంటాక్టుల నిష్పత్తి తక్కువగా ఉంటే కాంటాక్టులను గుర్తించే బృందాలను అప్రమత్తం చేయాలి.
► క్లస్టర్‌లోని హైరిస్క్‌ కేటగిరీ ప్రజలను గుర్తించి అందరికీ పరీక్షలు నిర్వహించాలి.
► కేస్‌ పాజిటివిటీ రేషియో (సీపీఆర్‌.. కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌లోని మొత్తం పాజిటివ్‌ కేసులు–మొత్తం పరీక్షల మధ్య నిష్పత్తి) ఎక్కువగా ఉంటే క్లస్టర్‌లో కమ్యూనిటీ వ్యాప్తి జరిగినట్లు గుర్తించాలి. సీపీఆర్‌ తక్కువగా ఉంటే రిస్క్‌ గ్రూపులలో తగినన్ని పరీక్షలు చేయలేదని భావించాలి.
► క్లస్టర్లలో కేసుల డబ్లింగ్‌ రేటును ప్రతి సోమవారం సమీక్షించాలి. రాష్ట్ర సగటు రేటు ప్రస్తుతం 11.3 రోజులుగా ఉంది. ఈ రేటుకన్నా ఆ క్లస్టర్‌లో డబ్లింగ్‌ రేటు ఎక్కువగా ఉంటే భౌతిక దూరం, క్వారంటైన్‌ సదుపాయాలు, చికిత్సలపై దృష్టి పెట్టాలి.
► క్లస్టర్లలో నాలుగు వారాలు (28 రోజులు) ఎలాంటి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాకపోతే నియంత్రణ చర్యలను క్రమేణా తగ్గించుకుంటూ రావాలి.
► ఈ మార్గదర్శకాల ఆధారంగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం 24 గంటల్లోగా ఈ మార్గదర్శకాల అమలుకు చర్యలు తీసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement