తాము యూనివర్సిటీలో ఉన్నట్లు లేదని మితిమీరిన నిబంధనలతో జైలు జీవితం గడిపినట్లుందని పలువురు
ఏఎన్‌యూ : తాము యూనివర్సిటీలో ఉన్నట్లు లేదని మితిమీరిన నిబంధనలతో జైలు జీవితం గడిపినట్లుందని పలువురు పరిశోధకులు మండిపడ్డారు. సోమవారం రాత్రి వర్సిటీ ఆవరణలో వాకింగ్ చేస్తున్న పరిశోధకులను పోలీసులు ప్రశ్నించడం, తిరగవద్దని ఆదేశించడంపై సోమవారం అర్థరాత్రి పరిశోధకులు ధర్నా చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పరిశోధకులతో మంగళవారం ఉదయం యూనివర్సిటీ రిజిస్ట్రార్ యూనివర్సిటీ పరిపాలనా భవన్‌లోని కమిటీ హాలులో పరిశోధకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశోధకులు తమ సమస్యలను వివరించారు.
గుర్తింపు కార్డుల తనిఖీ పేరుతో పోలీసులు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని, బైకులపై తిరిగే వారిని లెసైన్స్, సీబుక్ తదితర ఆధారాలు చూపించాలని నిలదీస్తున్నారని తెలిపారు. నిబంధనలు సడలించి పోలీసుల అజమాయిషీ తగ్గించాలని డిమాండ్ చేశారు. దీనికి స్పందించిన రిజిస్ట్రార్ ఇటీవల యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు విధించాల్సి వచ్చిందని కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకుంటాయన్నారు. డీఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ యూనివర్సిటీ అధికారుల సూచనల మేరకే తాము చర్యలు తీసుకుంటున్నామని తె లిపారు. ఇకమీదట గుర్తింపు కార్డులు మాత్రమే పరిశీలించాలని నిర్ణయించారు.
బాలుర వసతి గృహాలవైపు ఉన్న గేటును తెరవాలని, గుర్తింపు కార్డులు పరిశీలించి రాత్రి 11 గంటల వరకు రాకపోకలకు అనుమతి ఇవ్వాలని, పరిశోధకులకు నాలుగు సంవత్సరాల వరకు వసతి గృహ అడ్మిషన్ కల్పించాలని, వసతి గృహాల్లో ఉండే పరిశోధకులందరికీ యూనివర్సిటీ రీసెర్చిఫెలోషిప్‌లు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ పరిశోధకులకు ల్యాప్‌టాప్‌లు బ్యాంకు రుణాల ద్వారా ఇప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని పరిశోధకులు కోరారు. దీనికి రిజిస్ట్రార్ స్పందిస్తూ బాలుర వసతి గృహాలవైపు గేటు తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని, పరిశోధకులకు బ్యాంకుల ద్వారా ల్యాప్‌లాప్‌లు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు.