
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
తిరుమలః తిరుమలలో బుధవారం ఓ ప్రేమజంట ఆత్మహత్యయత్నంకు పాల్పడింది. వీరిని 108 అంబులెన్స్‌లో స్ధానిక అశ్విని ఆస్పత్రిలో వైద్యం అందజేసారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్ధితి స్ధమితంగానే ఉంది. వివరాల్లోకి వెళ్లగా.. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం సమీపంలోని ఈడిగపల్లెకు చెందిన రవికుమార్(28),పద్మా (25) వేరు వేరు కులాలు అయినప్పటికీ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ పెద్దలకు విషయం తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరనే ఉద్దేశ్యంతో గత రెండు రోజుల క్రితం తిరుమలకు వచ్చారు.
స్ధానిక వరాహస్వామి కాటేజి -1 లో 314 నెంబరు గదని అద్దెకు తీసుకున్నారు. సోమవారం సాయంత్రం శ్రీవారి ఆలయం ముందున్న అఖిలాండం వద్ద నిలబడి శ్రీవారిసాక్షిగా రవికుమార్ పద్మా మెడలో తాళికట్టాడు. పెళ్లి చేసుకున్న విషయాన్ని బుధవారం ఉదయం ఇరు కుటుంబ పెద్దలకు సమాచారం ఇచ్చారు. అయితే వారి పెద్దలనుండి సానుకూల స్పందన లభించలేదు. దీంతో మనస్తాపానికి గురైయిన రవికుమార్, పద్మాలు తిరుమలలోనే చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తిరుపతికి వెళ్లి పురుగుల మందు తెచ్చుకుని అతిధిగృహంలో తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతరం వారే , తమను రక్షించాలంటూ 108కు కాల్ చేసారు.
ఈ మేరకు హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది రవికుమార్, పద్మాలను అశ్విని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయాకు తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్ధితి బాగానే ఉందని వైద్యులు మీడియాకు తెలిపారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ మేరకు పద్మా మీడియాతో మాట్లాడుతూ కులాలు వేరనే కారణంతో మా పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని, పెళ్లిచేసుకున్న విషయాన్ని తెలియజేస్తే తిరిగి మళ్లితిట్టారని తెలిపింది. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది.