కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం.. ఈ సామెత కందుకూరు పోలీస్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు, హోంగార్డులకు అతికినట్లు సరిపోతుంది. పోలీస్‌శాఖలో ఉన్నతాధికారుల ఆదేశాలు, సూచనలు కిందిస్థాయి సిబ్బందికి తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. బాస్ చెప్పింది వినకుంటే ఆయన నుంచి కక్ష సాధింపు చర్యలు.. వింటే ఆయనపై స్థాయి అధికారుల పనిష్మెంట్లు. ఫలితంగా ఉద్యోగాలు చేయలేక కిందిస్థాయి సిబ్బంది నానాతంటాలు పడుతున్నారు.
కందుకూరు అర్బన్ : నాలుగు రోజుల క్రితం జరిగిన ఓ సంఘటనలో సర్కిల్ స్థాయి అధికారి చేసిన తప్పుకు ఓ కానిస్టేబుల్, హోంగార్డుపై ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వీరిని వీఆర్‌కు పంపి సదరు అధికారిని సేఫ్ జోన్‌లో ఉంచారు. వివరాలు.. స్థానిక కూరగాయల మార్కెట్ సెంటట్లో పీర్ల చావిడికి చెందిన ప్రభుత్వ భూమి ఉంది. రూ. కోట్లు విలువ చేసే ఆ భూమిని ఓ వ్యక్తి చాలా ఏళ్ల క్రితం కబ్జా చేసి కొందరితో చిన్న చిన్న బడ్డీ బంకులు పెట్టించి వారి నుంచి అద్దెలు వసూలు చేసుకుని సొమ్ము చేసుకుంటున్నాడు. పీర్ల చావిడిలోని కొంత భాగం, మున్సిపాలిటీకి చెందిన మరికొంత భాగంలో ఎస్‌కే మహ్మద్ అనే వ్యక్తి చాలా కాలం నుంచి బొంకు పెట్టుకొని జీవనం సాగించాడు.
ఈ క్రమంలో 20 ఏళ్ల క్రితం ఆ బొంకు దగ్ధమైంది. ఆ తర్వాత మహ్మద్ అదే ప్రాంతంలో చిన్నపాటి బొంకు పెట్టుకొని చిరు వ్యాపారం చేసుకుంటూ కొంతకాలం తర్వాత మరణించాడు. ఆయన తర్వాత పెద్ద కొడుకు హమీద్(వికలాంగుడు) వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటివల ఆ బొంకుకు హమీద్ మరమ్మతులు చేయించుకున్నాడు. దీన్ని సహించలేని సదరు ఆక్రమణదారుడు బాబు ఆ బంకు ఉన్న స్థలం తనదని, న్యాయం చేయాలని ఎస్సై వైవీ రమణయ్యను ఆశ్రయించాడు. దీంతో ఆయన స్థలానికి సంబంధించిన వివరాలు అందజేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. అది ప్రభుత్వ భూమి.. అని రెవెన్యూ అధికారులు చెప్పటంతో సివిల్ కేసులు తమకు సంబంధం లేదని ఎస్సై చెప్పారు. విషయం సర్కిల్ స్థాయి అధికారి వద్దకు చేరింది.
తన్నుకుంటూ స్టేషన్‌కు తీసుకెళ్లి..
ఈ సందర్భంగా సదరు అధికారి.. బాబు నుంచి ఫిర్యాదు కూడా స్వీకరించకుండా హమీద్, ఆయన తమ్ముడు అబీద్‌ను స్టేషన్‌కు పిలిపించి స్థలం తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇలా ఏడు సార్లకుపైగా స్టేషన్‌కు పిలిపించుకొని గంటల తరబడి ఉంచారు. నాలుగు రోజల క్రితం హమీద్‌ను తీసుకురావాలని తన సిబ్బందిని సదరు అధికారి అదేశించారు. దీంతో హోంగార్డు వినయ్‌తుల్లా, కానిస్టేబుల్ రమేష్‌లు హమీద్ వద్దకు వెళ్లారు. స్టేషన్‌కు రావాలని కోరగా తాను వికలాంగుడినని, తరచూ స్టేషన్‌కు రాలేనని చెప్పాడు. ఆయన తమ్ముడు అబీద్, రాధకృష్ణ అనే వ్యక్తి కలగజేసుకుని కాసేపటి తర్వాత పెద్దలతో కలిసి స్టేషన్‌కు వస్తామని పోలీసులకు నచ్చజెప్పారు. ఈ మేరకు విషయాన్ని సదరు అధికారికి పోలీసులు ఫోన్‌లో చేరవేశారు. అక్కడకు చేరుకున్న సర్కిల్ స్థాయి అధికారి అబీద్‌తో పాటు రాధాకృష్ణను కొట్టుకుంటూ తన వాహనంలో స్టేషన్‌కు తీసుకెళ్లారు.
అక్కడ మళ్లీ కొట్టేందుకు ప్రయత్నించడంతో అబీద్ పోలీసుస్టేషన్ నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా పలువురు నాయకులు వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం భూమిని అక్రమించిన శ్రీనుకు అండగా నిలిచి ఎలాంటి ఫిర్యాదు లేకుండా అధికారి స్వయంగా వచ్చి ఇద్దరిని కొట్టుకుంటూ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లడంపై పట్టణ ప్రజల నుంచి పలు విమర్శలు వెల్లువెత్తాయి. విషయం చినికి చినికి గాలి వానలా మారడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఆ సంఘటనపై విచారణకు ఆదేశించారు. చివరకు కానిస్టేబుల్‌తో పాటు హోంగార్డును బాధ్యులను చేస్తూ ఉన్నతాధికారులు వారిని గురువారం వీఆర్‌కు పంపారు. ఏడాది క్రితం ఇదేస్థాయి అధికారి అదేశాల మేరకు పట్టణలోని కేసరిగుంట కాలనీలో అర్ధరాత్రి ఓ ఇంటికి వెళ్లిన సంఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. అధికారుల పొరపాట్లతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కిందిస్థాయి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సార్..తప్పుకున్నారు!
Published Sat, Sep 20 2014 3:24 AM | Last Updated on Tue, Mar 19 2019 6:01 PM
Advertisement
Advertisement