సాగర్‌లో సగం మాకే.. లేదంటే బోర్డు చేతిలో..
- కృష్ణా బోర్డుకు లేఖ రాయనున్న ఏపీ ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: నాగార్జున సాగర్‌పై నియంత్రణ విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం ముదురతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు.. బోర్డు నియంత్రణలో ఉండాలని, లేదంటే కుడివైపున 13 గేట్లు, కుడికాల్వపై నియంత్రణ అధికారం తమకే ఉండాలని పేర్కొంటూ కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సాగర్ ప్రాజెక్టు తెలంగాణ నియంత్రణలో ఉండటం వల్ల ఏపీకి అన్యాయం జరుగుతోందని, కుడి కాల్వకు న్యాయంగా విడుదల చేయాల్సిన నీటిని ఇవ్వకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని బోర్డుకు విన్నవించనున్నారు.
కృష్ణా నదిలో లభ్యమయ్యే మొత్తం నీటిని లెక్కగట్టి, అందులో తమకు 42 శాతం వాటా ఉంటుందని, ఈమేరకు 228.71 టీఎంసీల నీటిని తాము వాడుకోవడానికి అవకాశం ఉందంటూ తెలంగాణ చేస్తున్న వాదనలో అర్థం లేదని పేర్కొననుంది. ‘‘కృష్ణా నీటి లభ్యతపై తెలంగాణ వాదన అర్థ రహితం. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు ఉన్నపుడు, వాటిని కాదని మొత్తం నీటిని సాగర్ నుంచి తీసుకుంటామని చెప్పడం నిబంధనలకు విరుద్ధం.
తెలంగాణ వాదనలో బలం ఉంటే.. ఎగువన ఉన్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఉపయోగించుకోబోమని, ఆ నీటిని సాగర్ నుంచే వాడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం జీవో ఇవ్వవచ్చు కదా? ఆమేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి, తర్వాత అమలు గురించి మాట్లాడాలి. ప్రాజెక్టుల వారీగా నీటి వాడకాన్ని నిర్ధారించే ప్రోటోకాల్స్ రూపొందించే బాధ్యతను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ప్రభుత్వం అప్పగించింది.
ఆ పని ట్రిబ్యునల్ చేస్తుంది. శ్రీశైలం ఎడమ గట్టున విద్యుత్ ఉత్పత్తి చేయడం నిబంధనలకు విరుద్ధమని కృష్ణా బోర్డు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించిన తెలంగాణ.. సాగర్ విషయంలో బోర్డు సమావేశం ఏర్పాటు చేసి తమకు నీటిని వాడుకొనే హక్కు కల్పించాలని కోరడం విచిత్రంగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నియంత్రణలో ఉంటుంది.
ప్రాజెక్టు ఎస్‌ఈ అనుమతి లేకుండా ఎడమగట్టున విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడుకొని, సాగర్ కుడివైపున నీటి విడుదలకు తమ అనుమతి ఉండాలని తెలంగాణ కోరడంలో అర్థం లేదు. రెండు ప్రాజెక్టులు బోర్డు నియంత్రణలో ఉండాలి. లేదంటే.. సాగర్‌లో సగం ఏపీ నియంత్రణలో ఉండాలి. మా భూ భాగంలోని కాల్వపై తెలంగాణకు నియంత్రణ ఎందుకు? ఈ విషయాలను మేం బోర్డుకు విన్నవించనున్నాం’’ అని నీటిపారుదల శాఖ అధికారులు చెప్పారు.