ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరిపోయే దీపమని, అందుకే తెలంగాణపై తప్పుడు కూతలతో కేంద్రం వద్ద మొరుగుతున్నాడని ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శించారు.
కమ్మర్‌పల్లి, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరిపోయే దీపమని, అందుకే తెలంగాణపై తప్పుడు కూతలతో కేంద్రం వద్ద మొరుగుతున్నాడని ఎంపీ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన రచ్చబండ-3 కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కూతలకు తెలంగాణ ప్రజలు భయాందోళనలకు గురి కావద్దన్నారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకున్నా, వారి తాత ముత్తాతలు దిగి వచ్చినా తెలంగాణను ఆపలేరన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక అభివృద్ధి చేయడంతోపాటు అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడతామన్నారు.
రాజ్యాంగ ప్రక్రియ జరుగుతోంది..
-ప్రభుత్వ విప్ అనిల్
అనంతరం ప్రభుత్వ విప్ అనిల్ మాట్లాడారు. మహిళలకు స్థానిక ఎన్నికల్లో 33 శాతం నుంచి 50 శాతం వరకు రిజర్వేషన్‌లు పెంచిన పుణ్యం ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి చెందుతుందన్నారు. తల్లిదండ్రులకు ఆడపిల్ల భారం కాకూడదనే బంగారుతల్లి పథకం ప్రవేశపెట్టినట్లు చెప్పారు. చంద్రబాబు సమన్యాయం పేరిట తెలంగాణను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. రాజకీయ రంగులు మారుస్తూ సమన్యాయమంటూ మళ్లీ ప్రజలను తికమకపెడుతున్నారన్నారు. తెలంగాణ టీడీపీ నాయకులు తమ అధినేతను నిలదీసి తెలంగాణపై ఉన్న చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. డిసెంబర్ 20న తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందాక, జనవరి ఒకటి తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ అంశం రాజకీయ ప్రక్రియ దాటి రాజ్యాంగ ప్రక్రియ వైపు సాగుతోందన్నారు. సీమాంధ్రులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా సోనియా గాంధీ ఒకసారి ఇచ్చిన మాట తప్పదన్నారు. నెహ్రూ, ఇందిర, రాజీవ్‌ల వల్ల కానిది సోనియా గాంధీ తెగించి ఇచ్చిన మాటకు కుట్టుబడిందన్నారు. కమ్మర్‌పల్లి నుంచి తడపాకల గోదావరి వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ. 14 కోట్లు మంజూరు చేయించినట్లు విప్ పేర్కొన్నారు.
మండల కేంద్రాల్లోనే సదరన్ శిబిరాలు
వికలాంగుల కోసం మండల కేంద్రాల్లోనే సదరన్ శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. అనంతరం బంగారు తల్లి, రేషన్‌కార్డులు, పింఛన్, గృహ నిర్మాణ మంజూరు, విద్యుత్ బిల్లు మాఫీ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.