ఈనెల 27న మహా శివరాత్రి. పొలతల, నిత్యపూజకోన, లంకమల, కన్యతీర్థం, అల్లాడుపల్లె వీరభద్రస్వామి దేవస్థానం, గుండాలకోన, అత్తిరాల ఆలయాలతో పాటు చాలా శైవక్షేత్రాల్లో భక్తులు విశేష పూజలు చేస్తారు. అయితే వారికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు, పాలకులు విఫలమవుతున్నారు.
ఈనెల 26, 27, 28 తేదీలలో ఈ పుణ్యక్షేత్రాల్లో భక్తులరద్దీ తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలో భక్తులకు అవసరమైన వసతులు ఎలా ఉన్నాయి...పాలకులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.. అనే కోణంలో న్యూస్‌లైన్ బృందం పుణ్యక్షేత్రాలను పరిశీలించారు. చాలా ఆలయాల్లో ఇప్పటికీ భక్తులకు అవసరమైన కనీస వసతులు కల్పించేందుకు ఆలయపాలానాధికారులు ఉపక్రమించలేదు. పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు సరైన దారులు లేవు...అక్కడికి వెళితే తాగేందుకు మంచినీళ్ల వసతి లేదు. విడిది గదులు లేవు....ఉన్నచోట శిథిలావస్థలో కొన్ని, నిరుపయోగంగా మరికొన్ని ఉన్నాయి. ఈ 20 రోజుల్లో ప్రత్యేక దృష్టి పెడితే భక్తులకు వసతులు కల్పించవచ్చు.
- సాక్షి, కడప
పెండ్లిమర్రి, న్యూస్‌లైన్ : జిల్లాలో ప్రసిద్ధి పొందిన శైవక్షేత్రాలలో పొలతల ఒకటి. ఈ క్షేత్రానికి వార్షిక ఆదాయం కోటి రూపాయలు ఉన్నా వసతులు, సౌకర్యాలు మాత్రం నామమాత్రమే. ప్రస్తుతం ఈ క్షేత్రానికి నిర్మిస్తున్న తారురోడ్డు నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు నాసిరకంగా చేపడుతున్నారు. ఏటా భక్తులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు.
తాగునీరు, బాత్‌రూమ్ సౌకర్యాలు కరువు :
పొలతల క్షేత్రానికి వచ్చే భక్తులకు తాగునీటి కొరత ప్రతి ఏడాది తప్పడం లేదు. ఆలయ ఆవరణంలో తాగునీటికి ఓవర్ హెడ్ ట్యాక్ 10లక్షల వ్యయంతో నిర్మించారు. దానికి పైపులైన్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో నిరుపయోగంగా ఉంది. ఇక్కడ ఒక్క బాత్‌రూమ్ కూడా లేదు. పర్యాటక భవనం నిర్మించినా సరైన వసతులు లేవు.
నిత్యపూజయ్యా.. వసతులు లేవయ్యా..
సిద్దవటం, న్యూస్‌లైన్: సిద్దవటం మండలంలోని లంకమల్ల అభయారణ్యంలో వెలసిన శ్రీనిత్యపూజయ్యస్వామి కోనకు నిధులు లక్షలరూపాయల్లో ఉన్నప్పటికీ ఆలయం అభివృద్ధికి నోచుకోలేదు. ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించి రూ.33 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేశారు. ఇటీవల భక్తుల తలనీలాల వేలంపాటలో రూ. 6.60 లక్షలు వచ్చింది. ప్రతి యేటా శివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులు అసౌకర్యాలకు గురవుతున్నారు. నీటిగుండం వద్ద నుంచి మూడు వైపులా ఉన్న తాపల వద్ద ఉత్సవాలల్లో వ చ్చి పోయే భక్తులతో రద్దీగా ఉంటున్నాయి. తాపలు వెడల్పు చేసి శాశ్వత బారికేడ్లు ఏర్పాటు చేయకుంటే ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయి. తాపలు పూర్తిగా దెబ్బతిని సంవత్సరాలు గడుస్తున్నా వాటికి మరమ్మతులు చేయలేదు.
భైరవకోన.. దారి లేక...
మైదుకూరు టౌన్, న్యూస్‌లైన్ :
మైదుకూరు మండలం తిప్పిరెడ్డిపల్లె పంచాయితీ పరిధిలో తాండ నుండి 20 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో వెళితే భైరవకోన ఆలయం వస్తుంది. ఈ గుడి దగ్గరకు వెళ్లాలంటే దారి అస్తవ్యస్తంగా ఉంది. రాళ్లు.. రప్పలూ.. గుండ్రాళ్లే ఎక్కువగా ఉంటాయి.
ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇక ఆలయం వద్ద వసతిగృహాలు లేవు. నీటి సౌకర్యం అరకొరే. కోనేరు శుభ్రం చేసేవారేలేరు. ప్రతి ఆదివారం ఇక్కడికి దాదాపు 100మందికి పైగా భక్తులు వస్తుంటారు. అయినా కూడా ఆలయ అధికారులు, పాలకులు ఎవరూ ఇటు వైపు చూడడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ 20 రోజుల్లో స్పందిస్తే...
సాక్షి, కడప: రాబోయే 20రోజుల్లో ఆలయపాలానాధికారులు మరమ్మతు చర్యలకు ఉపక్రమిస్తే శివరాత్రిరోజున భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా దర్శనం చేసుకుని వెళ్లే పరిస్థితి కల్పించినట్లవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులే ఉంటే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడకతప్పుదు.
జిల్లాలోని పలు క్షేత్రాల్లో
ముఖ్య సమస్యలు
భైరవకోనకు వెళ్లే 20 కిలోమీటర్ల రహ దారి పూర్గిగా గుంతలు, గుండ్రాల్లతో అధ్వాన్నంగా ఉంది. ట్రాక్టర్లు, లారీలతో పాటు కాలినడకన కూడా భక్తులు వెళతారు. ఇక్కడ విడిదిగహాలు నిర్మించినా వీటికి తలుపులు లేవు. నిరుపయోగంగా ఉన్నాయి. కుక్కలు కాపురం చేస్తున్నాయి.
నిత్యపూజ కోన ఆలయానికి సంబంధించి 33లక్షల రూపాయల బ్యాంక్‌డిపాజిట్స్ ఉన్నాయి. ఇటీవల 6.60లక్షల రూపాయల తలనీలాల ఆదాయం వచ్చింది. కానీ ఇక్కడ రోడ్డువసతి లేదు. కుంటల్లోని నీరు అపరిశుభ్రంగా ఉంది. దీన్ని క్లోరినేషన్ చేయాలి. స్నానం చేసిన తర్వాత మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేయాలి. మరుగుదొడ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.
అల్లాడుపల్లె వీరభద్రస్వామి సన్నిధిలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. కోనేటి గోడ కూలిపోయింది. దీన్ని పునర్నిర్మించాలి. పూర్తయిన అతిథిభవనం ప్రారంభానికి నోచుకోలేదు. దీన్ని ప్రారంభించాలి.
పొలతల ఆలయానికి లక్షలాధి భక్తులు వస్తారు. కానీ సరైన రోడ్డు మార్గం లేదు. పారిశుధ్యం, మంచినీటి సమస తీవ్రంగా ఉంది. రెండుకోనేర్లు ఉన్నా వాటిని శుభ్రపరచలేదు. ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించినా కనెక్షన్ ఇవ్వలేదు. వాహనాల పార్కింగ్‌కు ఏటా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కోటి రూపాయల ఆదాయం ఉన్నా వసతులు మాత్రం పూర్తిడొల్లగా ఉన్నాయి.
సౌకర్యాలు కల్పించాలి..
వేలాదిగా భక్తులు అత్తిరాలకు వస్తుంటారు. కనీస వసతులు కూడా లేవు. మహిళలు స్నానం చేయాలన్నా ఇబ్బందిగా ఉంది. బహుదానదిలో నీరు కలుషితం అవుతున్నాయి. ఆలయ అధికారులు సౌకర్యాలు కల్పిస్తే బాగుంటుంది.
- నాగినేని వెంకటరామయ్య, భక్తుడు, అత్తిరాల, రాజంపేట
దురదలు వస్తున్నాయి...
బహుదానది నీరు మురికి కావడంతో స్నానం చేస్తే దురదలు వస్తున్నాయి. శివరాత్రికి వచ్చే భక్తులు రాత్రి నిద్రించాలంటే కష్టంగా ఉంది. పైగా కోతుల బెడద ఎక్కువైంది. తాత్కాళిక రేకుల షెడ్లు నిర్మించాలి.
- కోవూరు శంకరయ్య,
అత్తిరాల, రాజంపేట
శివరాత్రి రోజు భక్తులు బాగా వస్తారు
గుండాలయ్య కోనకు శివరాత్రి, కార్తీక మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేసి జాగారాలు చేస్తుంటారు. సరైన సౌకర్యాలు లేక భక్తుల సంఖ్య తగ్గుతుంది. ఎంతో మహిమగల మళ్లేశ్వరున్ని ఆరాధించడం వల్ల కోరికలు నెరవేరుతున్నాయి. కష్టాలు పడుతూ ఆలయానికి భక్తులు వస్తున్నారు. సౌకర్యం కల్పిస్తె బాగా అభివృద్ధిచెందుతుంది.
- మస్తాన్ బాబు ( గొర్రెల కాపరి) యర్రబల్లి
ప్రారంభం ఎప్పుడో...
గత మూడు సంవత్సరాల నుంచి అత్తిరాలలో నత్తనడకన నడుస్తున్న అతిథి గృహం శివరాత్రికి పూర్తవుతుందా అని భక్తులు ఎదురుచూస్తున్నారు. వేల సంఖ్యలో వచ్చే భక్తులు రాత్రులు పవళించేందుకు ఈ భవనం ఏ పరిధిలో సరిపోతుందో ఆ సర్వేశ్వరునికే తెలియాలి.
- న్యూస్‌లైన్, రాజంపేట రూరల్
పర్యాటక అభివృద్ధి పనులలో భాగంగా నిర్మించిన భక్తాదుల అతిథి భవనం పూర్తయినా కూడా ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఏటా వీరభద్రుడి సన్నిధిలో భక్తులు అనేక అవస్థలు పడుతున్నా అధికారులుగానీ, పాలకులు గానీ పట్టించుకోవడం లేదు. శివరాత్రికయినా ప్రారంభిస్తే వసతి కల్పించినవారవుతారు.
- న్యూస్‌లైన్,చాపాడు
రాళ్లు రప్పలు... నడవాలంటే తిప్పలు
ఈ ఫోటో చూశారా? ఇదేదో కొండకాదు. నిత్యపూజకోనకు వెళ్లే దారి. శివరాత్రిరోజున ఇక్కడకు కూడా వేలాదిమంది భక్తులు వస్తుంటారు. అయితే భక్తులు వెళ్లేందుకు సరైన మార్గం లేదు. మెయిన్‌రోడ్డు నుంచి 14 కిలోమీటర్లు ఉంది.
ఇందులో 3 కిలోమీటర్లు గుట్టలు, రాళ్లలో నడవల్సాందే! మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఈ గుట్టల్లో నడవాలంటే కుదరనిపని. కనీసం నడిచేందుకు వీలుగా దారిని ఏర్పాటు చేయాల్సిఉంది. అలాగే ఆలయంలోకి వెళ్లే మెట్లు కిలోమీటరు మేర ఉన్నాయి. మెట్లకు ఇనుపకంచె పాడైపోయింది. భక్తుల రద్దీలో తోపులాట జరిగితే మెట్లపై నుంచి కొండలోకి పడిపోకతప్పుదు. పండుగ 20రోజులు ఉంది. ఈలోగా దారితో పాటు మెట్లకు కంచెను రక్షణ కంచె ఏర్పాటు చేయాల్సి ఉంది. లేదంటే భక్తులు ఇబ్బందిపడక తప్పదు.
పంచలింగాల.. వెళ్లేదెలా..
పులివెందుల టౌన్, న్యూస్‌లైన్ :
పులివెందుల మండల పరిధిలో ఉన్న పంచలింగాల కోన, గుండాలయ్యకోనలో ఉన్న శైవక్షేత్రాలు అభివృద్ధికి నోచుకోలేదు. ఏళ్లు గడుస్తున్నా పాలకులు అటువైపు కన్నెత్తి చూసిన పాపానపోలేదు.
కాలినడకన భక్తులు వె ళుతూ ఇబ్బందులు పడుతున్నారు. పురాతన ఆలయాలైన పంచలింగాల, గుండాలయ్యకోనలకు భక్తులు కార్తీకమాసంలో, శివరాత్రి పండుగరోజుల్లో పెద్దసంఖ్యలో వెళ్లి శివున్ని దర్శించుకుంటారు. పంచలించాల కోన పులివెందుల నుండి 10కిలోమీటరు దూరం ఉంటుంది. గుండాలయ్యకోనలకు 3కిలోమీటర్లు దూరం ఉంది. పొలాల మీదుగా కాలి నడకన భక్తులు వెళ్లాల్సిందే. నల్లపురెడ్డిపల్లె గ్రామ పెద్దలు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు బలరామిరెడ్డి ఆధ్వర్యంలో మట్టిరోడ్డు ఏర్పాటు చేశారు. వర్షాల కారణంగా రోడ్డు దెబ్బతినింది. ప్రస్తుతం దారి వెంట ముళ్లపోదలు, రోడ్డు గుంతలమయం కావడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
అత్తిరాల... సమస్యల గోల..
రాజంపేట రూరల్, న్యూస్‌లైన్: రాజంపేట మండలంలోని అత్తిరాల(హత్యరాల)లో సమస్యలు తాండవిస్తున్నాయి. భక్తులకు మరుగుదొడ్ల సౌకర్యం లేదు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ మూడు రోజుల పాటు కొనసాగే ఈ తిరుణాలలో భక్తులు నిద్ర చేయడమంటే సాహసమే. అగ్రహారంలో ఉన్న చిన్న సత్రాలు తప్ప వేరే గత్యంతరం లేదు. వేలసంఖ్యలోపాల్గొనే భక్తులు పడిగట్లు, ఆలయం, ఆరుబయట పవళించాల్సిందే. చంటిపాపలు, వృద్ధులకు ప్రత్యక్ష నరకం ఇక్కడే కనిపిస్తుంది. ఆలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో కనీసం రేకుల షెడ్లు నిర్మించినా బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.
- ఇక్కడ ప్రవహించే బహుదానదిలో స్నానం ఆచరిస్తే... సకలపాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రస్తుతం ఈ నదిలో మునిగితే పాపాలు పోవడం అటు ఉంచితే, రోగాలు రావడం ఖాయమని ప్రజలు అంటున్నారు. బహుదానదిలో నీరు కలుషితం కావడమే దీనికి కారణం. ఇక స్వామివారి రథం శిథిలావస్థకు చేరింది.
వీరభద్రా... కనుమా...
చాపాడు, న్యూస్‌లైన్: అల్లాడుపల్లె శ్రీవీరభద్రస్వామి సన్నిధిని చాపాడు మీదుగా చేరుకునే సీతారామాపురం వద్ద గల కుందూనదిపై పాత వంతెన(100 ఏళ్లుపై బడినది) తూర్పు వైపు గోడ కుంగిపోయింది. రెండేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ అనిల్‌కుమార్ ఈ వంతెనను పరిశీలించినా పూర్తిస్థాయిలో ప్రయోజనం లేదు. కొన్ని నెలల క్రి తం దీని మరమ్మతులకు నిధులు మంజూరైనా పనులు చేయటంలో నిర్లక్ష్యం కన్పిస్తోంది.
లంకమల్లేశ్వరా... చూస్తున్నావా..
బద్వేలు, న్యూస్‌లైన్‌ః బద్వేలు నుంచి 25 కిలోమీటర్ల దూరంలోని లంకమల్ల అడవుల్లో లంకమల్లేశ్వర క్షేత్రం ఉంది. సరైన దారి సౌకర్యం లేదు. దాదాపు పది కిలోమీటర్లు అడవి మార్గాన ప్రయాణం చేయాల్సి ఉంది.
ఈ దారి కూడా పెద్ద పెద్ద బండరాళ్లతో, గుంతలతో ఉంది.
- లంకమల్లేశ్వర క్షేత్రంలో స్నానపు గుండం వద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అంతే. గతేడాది ఒక భక్తుడు ఇందులో పడి మృతి చెందాడు. అంతకు మునుపు కూడా జరిగిన ప్రమాదాల్లో ప్రాణనష్టం సంభవించింది. అధికారులు పక్కాగా జాగ్రత్తలు తీసుకోవాలి.
శివుడి సన్నిధానం... సమస్యలే సమస్తం
Published Fri, Feb 7 2014 2:49 AM | Last Updated on Mon, Oct 8 2018 4:35 PM
Advertisement
Advertisement