విజయనగరం అర్బన్ : పంట రుణమాఫీకి సంబంధించిన రైతు జాబితాలను ప్రభుత్వం విడుదల చేసింది. జాబితాను జిల్లా కేంద్రానికి కాకుండా నేరుగా తహశీల్దార్లకు పంపింది. ప్రభుత్వం ఇచ్చిన పాస్‌వర్డ్‌తోనే అక్కడి అధికారులు ఓపెన్ చేసేలా ఏర్పాటు చేశారని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. జాబితాను పునఃపరిశీలించడం వంటి కీలకమైన బాధ్యతలను గ్రామ జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఈ జాబితాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించారు. జన్మభూమి కమిటీలకు ఈ బాధ్యతలను అప్పగించడం వల్ల మిగతా పార్టీల మద్దతుదారులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది.
రుణమాఫీ నిబంధనల మేరుకు జిల్లాలో 2,79,139 మంది రైతుల పేర్లను అన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే వివిధ కారణాలతో వీరిలో 28,700 వేల మంది రైతులు తిరస్కరణ జాబితాలో చేరారు. ప్రధానంగా ఆధార్, రేషన్‌కార్డులు లేకపోవడంతో వీరందర్నీ తిరస్కరణ జాబితాలో పెట్టారు. అయితే రుణమాఫీ జాబితాపై ప్రభుత్వం పునర్విచారణకు ఆదేశించింది. బ్యాంకర్లు పంపిన వివరాలు సరిగా ఉన్నాయో. ..? లేవో ?విచారణ చేపట్టాలని రెవెన్యూ శాఖకు సూచించింది. వీఆర్వోల ద్వారా గ్రామ గ్రామానికి వెళ్లి జాబితాలపై పునర్విచారణ చేసి, నివేదిక సమర్పించాలని ఆదేశాలలొచ్చినట్లు తెలుస్తోంది.
మరో వైపు తిరస్కరణ జాబితాలోని రైతుల అర్హతులను పునఃపరిశీలించే బాధ్యతను గ్రామస్థాయి జన్మభూమి కమిటీలకు అప్పగించింది. దీంతో రాజకీయ కక్షసాధింపు చర్యలకు అవకాశం ఇచ్చినట్టు అయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం నుంచి పునర్విచారణ ప్రారంభమైనట్టు తెలిసింది. రుణమాఫీ పొందే రైతుతోపాటు కుటుంబసభ్యుల్లో మేజర్లయిన అయిన ఇద్దరి వివరాలు సేకరించాలి.
రైతుపై ఆధారపడిన ఇద్దరు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, ఇంటిపేరుతో బంధుత్వం, డోర్ నంబర్, ఓటరు ఐడీకార్డు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు వివరాలను వీఆర్వోలు సేకరించాలి. సేకరించిన వివరాలపై జన్మభూమి కమి టీలతో సంతకం చేయించి తహశీల్దార్‌కు అందిస్తే ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపాలి. ఈ తంతును మూడు రోజుల్లోగా ముగించి, ఈ నెల 13వ తేదీలోగా తిరిగి బ్యాంకుల్లో తాజా జాబితాను అప్‌లోడ్ చేయాలని ఆదేశాలొచ్చాయి.
రుణమాఫీ తాజా జాబితాను బ్యాంకర్లకు పంపలేదు
రైతు రుణమాఫీ జాబితా సవరణ కోసం నేరుగా తహశీల్దార్ కార్యాలయాలకు ప్రభుత్వం పంపిందని లీడ్‌బ్యాంక్ మేనేజర్ వి.శివబాబు తెలిపారు. గ్రామ జన్మభూమి కమిటీ పునఃపరిశీలన కోసం నేరుగా రెవెన్యూఅధికారులకు పంపింది. అర్హతలను మరోసారి కమిటీ పరిశీలించి, తిరస్కరణ జాబితాలోనే నిజమైన అర్హులుంటే అర్హత కల్పిస్తారు. సవరించిన జాబితాను ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5.00 గంటలోపు ఆప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపారు.
జన్మభూమి కమిటీలకు కీలక బాధ్యతలు !
Published Wed, Nov 12 2014 4:27 AM | Last Updated on Thu, Apr 4 2019 2:48 PM
Advertisement
Advertisement