
పెట్రోల్ పోసుకుంటున్న బాధితుడిని వారిస్తున్న మాలమహానాడు నాయకులు
సాక్షి, నంద్యాల (కర్నూలు): మహానంది పోలీసులు తనపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధిస్తున్నారంటూ గురువారం ఓ రైతు ఆర్డీఓ ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. తన పొలాన్ని తిరుపతయ్య అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని మహానంది మండలం గాజులపల్లె గ్రామానికి చెందిన రైతు సుధాకర్ మాల మహానాడు నాయకులతో కలిసి ఆర్డీఓ రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశాడు. నాయకులు ఆర్డీఓకు వినతిపత్రం ఇస్తుండగానే సుధాకర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అక్కడున్న వారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధిత రైతు మాట్లాడుతూ తిరుపతయ్య తన పొలాన్ని ఆశ్రమించుకోవడమే గాక స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని, పోలీసులు కూడా తనపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని వాపోయాడు. స్పందించిన ఆర్డీఓ అధికారులతో విచారించి, పొలం సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.