డ్రా చేయకుండానే ఏటీఎం నుంచి డబ్బులు
చిత్తూరు (అర్బన్) : ఏటీఎం సెంటర్లో డబ్బులు తీసుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి కార్డును ఉపయోగించకుండానే నోట్లు వచ్చాయి. ఏకంగా రూ.15 వేల నగదు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు ఆ వ్యక్తి. అయితే తనది కాని డబ్బు వద్దని నిర్ణయించుకుని ఈ మొత్తాన్ని పోలీసులకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. బంగారుపాళ్యంకు చెందిన విజయకుమార్ సోమవారం చిత్తూరుకు పని మీద వచ్చాడు. కొంగారెడ్డిపల్లెలోని ఎస్‌బీఐ స్టేట్ బ్యాంకు ఏటీఎంలో రూ.15 వేల నగదు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించాడు. మిషన్ నుంచి నగదు రాకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కొద్ది సేపటి తరువాత ఎస్‌ఆర్.పురం మండలం డీకే.మర్రిపల్లెకు చెందిన బి.బాబు అనే వ్యక్తి అదే ఏటీఎంలో నగదు తీసుకోవడానికి వచ్చాడు. కార్డు ఉపయోగించేలోపే ఏటీఎం నుంచి రూ.15 వేలు బయటకు వచ్చాయి. దీన్ని తీసుకున్న కొద్ది సెకన్లలో బ్యాలన్స్ చూపే కాగితం కూడా వచ్చింది. నగదును తీసుకున్న బాబు ఆ మొత్తాన్ని చిత్తూరు వన్‌టౌన్ సీఐ నిరంజన్‌కుమార్‌కు అందజేశారు. బ్యాలెన్స్ చీటీలో ఉన్న ఆధారాలతో విజయకుమార్‌ను స్టేషన్‌కు పిలిపించిన సీఐ, ఎస్‌ఐ రాంభూపాల్‌లు రూ.15 వేల నగదును బాబు చేతులు మీదుగా అందచేశారు. నిజాయితీను చాటుకున్న బాబును పోలీసు అధికారులు అభినందించారు.